Prisoner Education: స్వేచ్చ బ్యూరో: జైళ్లలోని ఖైదీలకు విద్యావకాశాలు కల్పించడం, వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా జైళ్ల శాఖ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీవోఎస్ఎస్) సహకారంతో శనివారం ఓపెన్ స్కూలింగ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా, డీజీ డాక్టర్ సౌమ్యా మిశ్రాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను, శక్తిని వివరించారు. విద్య అన్నది కేవలం జ్ఞానాన్ని, విద్యార్హతలను మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా అందిస్తుందని తెలిపారు. దీపావళి పండుగ చీకటిని తొలగించి వెలుగులు నింపినట్టే విద్య అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానం, ఆత్మవిశ్వాసం ఆశాజ్యోతులను వెలిగిస్తుందని పేర్కొన్నారు. ఖైదీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ చదువును కొనసాగిస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ఖైదీలకు విద్యను మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో జైళ్లలో ప్రత్యేక టీవోఎస్ఎస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రోత్సాహకంగా ప్రతి ఖైదీకి కోర్సు ఫీజులో 1,250 రూపాయల రాయితీ ఇవ్వనున్నట్టు చెప్పారు. దీనివల్ల ఖైదీలపై ఆర్థిక భారం తగ్గి మరింత మందికి విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, ఖైదీలలో పఠనాసక్తిని పెంపొందించేందుకు, అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు, సానుకూల వాతావరణాన్ని కల్పించేందుకు జైళ్లలో లైబ్రరీల ఏర్పాటుకు అవసరమైన స్పాన్సర్ షిప్, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఖైదీల పిల్లలు చదువుకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత వివరాలతో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతిపత్రం సమర్పించవచ్చన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ లింగయ్య మాట్లాడుతూ జైళ్ల శాఖకు టీవోఎస్ఎస్ తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. తరగతులు కేవలం ఆదివారాలు, రెండవ శనివారాలకే పరిమితం కాకుండా జైళ్ల శాఖ అవసరాలు, సౌకర్యాన్ని బట్టి ఇతర రోజుల్లో కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, తెలంగాణ జైళ్ల శాఖ లక్ష్యం కేవలం ఖైదీలను సురక్షితంగా ఉంచడం, భద్రత కల్పించడం మాత్రమే కాదన్నారు. జైళ్లను సంస్కరణ, పునరావాసం, విద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్య ఖైదీల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి అత్యంత ప్రభావవంతమైన సాధనమని, తద్వారా వారు శిక్షాకాలం అనంతరం సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తిరిగి జీవించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. యోగితా రాణా 2015–2017 మధ్య నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో జైళ్ల శాఖకు అందించిన సహకారాన్ని డీజీ ప్రత్యేకంగా గుర్తుచేశారు.
Also Read: అన్నమయ్య జిల్లాలో విషాదం.. తల్లిని చంపిన తండ్రి.. మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య!
ఆ సమయంలో జైళ్లలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇండస్ట్రియల్ షెడ్, అవసరమైన యంత్రాల ఏర్పాటుకు ఆమె ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. ఈ సదుపాయాలు జైళ్లలో పరిశ్రమల అభివృద్ధికి, ఖైదీలకు ఉత్పాదకమైన పని అవకాశాలు కల్పించడానికి ఎంతగానో దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఖైదీల సంక్షేమంపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను డీజీ అభినందించారు. జైళ్లలో టీవోఎస్ఎస్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనను యోగితా రాణానే సూచించారని చెప్పారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం లభించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా, ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు అక్టోబర్ 12వ తేదీతో ముగిసినా ఖైదీలు ఈ అవకాశాన్ని కోల్పోకుండా ఉండేందుకు గడువు పొడిగింపునకు కూడా ఆమె ప్రత్యేకంగా కృషి చేశారని డీజీ కృతజ్ఞతలు తెలిపారు.
ఓపెన్ స్కూలింగ్ కార్యక్రమం ద్వారా ఖైదీలు టీవోఎస్ఎస్ సహకారంతో 10వ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు అభ్యసించవచ్చు. స్టడీ మెటీరియల్ ఇవ్వటంతోపాటు ప్రతి ఆదివారం, రెండవ శనివారం తరగతులు నిర్వహిస్తారు. ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితి లేకపోవడంతో ఏ వయసున్న ఖైదీ అయినా చదువును తిరిగి కొనసాగించవచ్చు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనంతరం నిర్దేశిత అర్హతలు, ప్రవేశ నిబంధనలకు లోబడి ఉన్నత విద్యను కూడా అభ్యసించవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి 70 మంది ఖైదీలు 10వ తరగతి, 15 మంది ఖైదీలు ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. మొత్తం 85 మంది ఖైదీలు ఇప్పటికే ఈ కార్యక్రమంలో చేరేందుకు ముందుకు రావడం సంతోషకరమని డీజీ తెలిపారు. మరింత మంది ఖైదీలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా అన్ని జైళ్లలో అవగాహన కల్పించి, వారిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
జైళ్లలో విద్యాభివృద్ధి కోసం శాఖ చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ ‘థంబ్ ఇన్..సైన్ అవుట్’ అక్షరాస్యత కార్యక్రమం ద్వారా 2025లో 23,220 మంది ఖైదీలకు అక్షరజ్ఞానం కల్పించినట్లు డీజీ తెలిపారు. అదేవిధంగా, ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో 78 మంది ఖైదీలు ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి 56 మంది, నిజామాబాద్ సెంట్రల్ ప్రిజన్ నుంచి 15 మంది, హైదరాబాద్ లోని స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ 7 మంది ఉన్నారన్నారు.
విద్యతో పాటు తెలంగాణ జైళ్ల శాఖ వృత్తి నైపుణ్య శిక్షణ, జైళ్ల పరిశ్రమలు, వ్యసన విముక్తి కార్యక్రమాలు, మానసిక కౌన్సెలింగ్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను అమలు చేస్తూ ఖైదీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీ మురళీ బాబు, డీఐజీలు డాక్టర్ శ్రీనివాస్, సంపత్, సూపరింటెండెంట్లు నవాబ్ శివకుమార్ గౌడ్,, సంతోష్ కుమార్ రాయ్, ప్రమోద్ ఇండస్ట్రీస్ డిప్యూటీ డైరెక్టర్ ఖలీద్ అక్తర్ పాల్గొన్నారు. వారితోపాటు మలక్ పేట మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అజర్, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రంగారెడ్డి జిల్లా టీవోఎస్ఎస్ కోఆర్డినేటర్లు, విద్యాశాఖకు చెందిన అధికారులు కూడా ఉన్నారు.
Also Read: రుచికరమైన సేమ్యా పాయసం..ఈ కొలతలతో చేస్తే చల్లారినా గట్టిపడదు