KTR: ఈ ఒక్క మాట ఈ ఒక్క ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత దుమారం రేపిందో తెలంగాణ మొత్తం చూసింది. కొండా సురేఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ టార్గెట్‌గా వ్యక్తిగత ఆరోపణలు చేశారు. సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, వారి వ్యక్తిగత జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలకు కేటీఆర్ కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన ఆరోపణలను కేటీఆర్ అప్పుడే ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వం, కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే.. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు నష్టం కలిగించారని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో వంద కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇది జరిగిన ఇన్నాళ్ల తర్వాత.. కొండా సురేఖ కేటీఆర్‌ను క్షమాపణ కోరడం హాట్ టాపిక్‌గా మారింది. ఎక్స్ వేదికగా సారీ చెప్పడం సంచలనమైంది.
గతంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో నిరాధారమైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేశానని కొండా సురేఖ తెలిపారు. అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం తనకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు కేటీఆర్‌ని, వారి కుటుంబ సభ్యులను నొప్పించి ఉంటే.. అందుకు చింతిస్తున్నానని, తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అయితే, అప్పట్లో మాటల యుద్ధం ఓ రేంజ్‌లో ఉంటే.. ఇప్పుడు సారీతో సీన్ సెట్ రైట్ అయిందనే టాక్ వినిపిస్తోంది.
కొండా సురేఖ క్షమాపణపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. నిజం ఎప్పుడూ నిలకడ మీదే తేలుతుందన్నారు. క్షమాపణలు చెప్పే వాళ్ల లిస్ట్ ఇంకా చాలా పెద్దదే ఉందన్నారు. సురేఖ సారీపై.. కేటీఆర్ రియాక్షన్ ఇది. తమపై నిరాధార ఆరోపణలు చేసిన వాళ్లంతా.. వరుసగా క్షమాపణలు చెబుతారని హింట్ ఇచ్చారు. దాంతో.. సారీ చెప్పబోయే నెక్ట్స్ కాంగ్రెస్ లీడర్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also read: కెటిఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు.. ఉద్దేశపూర్వకంగా అనలేదని క్లారిటీ ఇచ్చిన సురేఖ!