Huzurabad Housing: స్వేచ్చ బ్యూరో: అర్హులైన నిరుపేదలకు పక్కా గూడు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని కొందరు స్వార్థపరులు, కొందరు అధికారుల ఉదాసీనత నీరుగారుస్తున్నాయి. హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 9వ వార్డులో న్యాయస్థానం ఇంజంక్షన్ ఉత్తర్వులు అమల్లో ఉన్న భూమిలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం, దాన్ని అడ్డం పెట్టుకుని పక్కవారి స్థలంలోనూ నిర్మాణాలు చేపడుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
స్థానిక 9వ వార్డులోని వివాదాస్పద సర్వే నంబర్ స్థలంపై గతంలోనే న్యాయస్థానం ఇంజంక్షన్ (యథాతథ స్థితి) ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ లేదా పురపాలక రికార్డులను పరిశీలిస్తే ప్రస్తుతం అక్కడ నిర్మాణం చేపడుతున్న సదరు మహిళ పేరు గానీ, ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు గానీ నమోదు కాలేదు. ఎలాంటి యాజమాన్య హక్కు పత్రాలు లేని పరాయి స్థలంలో ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్స్ ఎలా మంజూరయ్యాయన్నది అంతుచిక్కడం లేదు. ఆన్లైన్ పోర్టల్‌లో ఏ డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారు? క్షేత్రస్థాయి విచారణ చేయకుండా ఏ అధికారి ధ్రువీకరించారు? మంజూరు పత్రాలు జారీ చేసిన అధికారులను ఎవరు తప్పుదోవ పట్టించారనే విషయాలు నిగ్గుతేలాల్సి ఉంది.
కోర్టు ఆదేశాలను పక్కనబెట్టడమే కాకుండా, పక్కనే చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లోకి చొచ్చుకెళ్లి పిల్లర్లు వేసి భవన నిర్మాణ పనులు వేగవంతం చేశారు. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసుకున్న రిజిస్ట్రేషన్ స్థలం కళ్లెదుటే ఆక్రమణకు గురవుతోందని బాధితులు ఆధారాలతో పురపాలక కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.
Also read: కోనసీమలో చంద్రబాబు పర్యటన.. తుఫాన్ బాధితులకు గుడ్ న్యూస్.. అధికారులకు కీలక ఆదేశాలు!
ఈ అక్రమ నిర్మాణంపై పురపాలక కమిషనర్‌ను వివరణ కోరగా నిర్లక్ష్యపు సమాధానం ఎదురైంది. “ప్రస్తుతం అది ఇందిరమ్మ ఇల్లు పేరుతో నమోదై ఉంది.. దాన్ని మేము తొలగించలేం. మా నిబంధనల ప్రకారం రెండు నోటీసులు జారీ చేశాం” అని దాటవేశారు. అంతేకాకుండా, ఆ మొత్తం స్థలం నిషేధిత జాబితా (ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ)లో ఉందని పేర్కొన్నారు. స్థలమే నిషేధిత జాబితాలో ఉన్నప్పుడు సర్కారు ఇంటికి జియో ట్యాగింగ్ ఎలా జరిగింది? ప్రొసీడింగ్స్ ఎలా జారీ చేశారనే ప్రశ్నలకు అధికారుల వద్ద పొంతనలేని సమాధానాలు వస్తున్నాయి. నిర్మాణం పూర్తయ్యేంత వరకు నోటీసుల పేరుతో కాలయాపన చేస్తారా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు..
ఇందిరమ్మ పథకం పేరుతో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి, పక్కవారి రిజిస్ట్రేషన్ భూమిని ఆక్రమిస్తున్న వ్యవహారంపై జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. తప్పుడు పత్రాలతో ఇల్లు మంజూరు చేయించిన బాధ్యులపై విచారణ జరిపి, తక్షణమే అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read: జగిత్యాల శ్మశానవాటికలో క్షుద్రపూజల కలకలం.. బొమ్మకు సూదులు గుచ్చి..?