Konda Sushmitha Post Viral: సంచలనాలకు కేరాఫ్ అయిన కొండా దంపతులు.. మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. కొండా ఫ్యామిలీ రేపిన దుమారం.. వరంగల్ కాంగ్రెస్ రాజకీయం దుమ్ము దులుపుతోంది. ఈ క్రమంలో కొండా స్టోరీలోకి మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చారు.
కొండా మురళీ ఎపిసోడ్ ముగియక ముందే పొలిటికల్ టర్న్ తీసుకుంది.. ఆయన కూతురు కొండా సుస్మిత.. ఆస్పైరింగ్ ఎమ్మెల్యే పరకాల అంటూ తన X అకౌంట్‌ను అప్‌డేట్ చేసింది ఆమె. పరకాల నుంచి తన కూతురు పోటీకి సిద్ధమవుతోందని గతంలో కొండా మురళి ప్రకటించారు. కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతల పంచాయతీ కొనసాగుతుండగానే.. కొండా సుస్మిత సోషల్ మీడియా అకౌంట్ అప్‌డేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
బహిరంగ వేదికపై సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. పార్టీకి కొండా ఫ్యామిలీ కావాలా? లేక.. మేము కావాలా? తేల్చుకోవాలని.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు అల్టిమేటమ్ జారీ చేసే స్థాయికి చేరింది వివాదం. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసరంగా సమావేశమయ్యారు. వీరిలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితర కీలక నేతలకు కొండా ఫ్యామిలీకి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బహిరంగంగా సవాళ్లు చేసుకునే పరిస్థితి నెలకొంది.
ఇదిలాఉంటే.. కాంగ్రెస్ నేత కొండా మురళి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరినీ డబ్బులు అడగలేదన్నారు. గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. మొన్ననే 16 ఎకరాలు అమ్మిన, ఇంకా 500 ఎకరాలు ఉందని చెప్పుకొచ్చారు. వాసవి కన్యకాపరమేశ్వరి సాక్షిగా.. తనకు ఎవరి పైసా అక్కర్లేదన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఓరుగల్లులో కాంగ్రెస్ వర్గపోరు ఓ కొలిక్కి రావడంలేదు. మొన్నటి వరకు వాళ్లలో వాళ్లు కొట్టుకున్నారు.. ఇప్పుడా పంచాయతీ పీసీసీ వద్దకు చేరింది. అయినా ఎవరు తగ్గడం లేదు. ఎవరికి వారే కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం అంటూనే.. తమకు అనుకూలంగా రాకపోతే తామేంటో కూడా చూపిస్తామన్నట్లు కౌంటర్లు వేస్తున్నారు.
Also Read: సున్నం చెరువు వద్ద హై టెన్షన్.. హైడ్రాపై తిరగబడ్డ బాధితులు
ఇప్పుడు కొండా కుమార్తె పొలిటికల్ ఎంట్రీతో.. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మరింత అలజడి సృష్టిస్తోంది. పరకాల అస్ఫరెంట్ అంటూ పరకాల నుంచి పోటీకి సిద్ధమని.. కొండా సుస్మిత ఇన్‌స్టా బయో సూచిస్తోంది. ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్న కొండా సుస్మితా పటేల్.. ఫుల్ టైమ్ రాజకీయాల్లో అలర్ట్ ఉంటే ఎలా ఉంటుందోనని.. పార్టీలో గుసగుసలు వినిపిస్తోంది. మరి దీనిపై వరంగల్ కాంగ్రెస్ నేతలు ఎలా స్టాండ్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే.