Konda Surekha: స్వేచ్ఛ బ్యూరో: స్టేట్ పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేసిన మాజీ మంత్రి కొండా సురేఖ గత కొన్ని రోజులుగా మౌనంగా వ్యవహరించడంపై కూడా చర్చకు దారితీసింది. ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరొందిన మాజీ మంత్రి కొండా సురేఖ అనుసరిస్తున్న మౌనం, నిత్యం మీడియా ముందు ఉంటూ, ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడే ఆమె గత కొద్ది రోజులుగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మౌనం వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందా? లేక మంత్రి పదవి కోల్పోయిన అసహనంతో ఆమె ఇలా వ్యవహరిస్తున్నారా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
మంత్రి పదవి కోల్పోయిన వేళ..
రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించిన కొండా సురేఖ, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. పార్టీ కోసం మొదటి నుంచీ కష్టపడి పనిచేసినప్పటికీ, తనకు అన్యాయం జరిగిందనే భావనలో ఆ సీనియర్ శాసనసభ్యురాలు ఉన్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతల వ్యవహారశైలి, అధిష్టానం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆమె తీవ్ర అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మనస్తాపంతోనే ఆమె పార్టీ కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు దూరంగా ఉంటూ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.ఈ క్రమంలోనే ఆమె పార్టీ, ప్రభుత్వం ప్రోగ్రామ్స్ లో పెద్దగా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తుంది.
పార్టీకి సహకరిస్తారా? లేదా?
కొండా సురేఖ మౌనం ఇప్పుడు హస్తం పార్టీ నేతల్లో చర్చకు తెరలేపింది. రాబోయే రోజుల్లో జరగబోయే కీలక ఎన్నికలు,ముఖ్యంగా పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె పాత్ర అత్యంత కీలకం కానుంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో కొండా దంపతులకు బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పూర్తిస్థాయిలో సహకరిస్తారా? లేక తటస్థంగా ఉండి పోతారా? అన్న అంశంపై గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆమె సహకరించకపోతే, అది పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఇప్పటికే కొండా ఫ్యామిలీ ని ప్రత్యేకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీని కలిసి మద్ధతు కోరారు. ఆయన కూడా సపోర్టు చేస్తానని అభ్యర్థికి కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ మాజీ మంత్రి మౌనంతో అధికార పార్టీలోని అభ్యర్ధుల్లోనూ టెన్షన్ మొదలైంది.
కన్ఫ్యూజన్లో ముఖ్య నేతలు.. లభించని రూట్ మ్యాప్..
కొండా సురేఖ తదుపరి అడుగు ఎలా ఉండబోతోందనే విషయంపై స్పష్టమైన ‘పొలిటికల్ రూట్ మ్యాప్’ లభించకపోవడంతో కాంగ్రెస్ ముఖ్య నేతలు తీవ్ర కన్ఫ్యూజన్లో పడ్డారు. ఆమెను బుజ్జగించేందుకు అధిష్టానం తరఫున కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, సురేఖ మాత్రం తన మనసులోని మాటను బయటపెట్టడం లేదని తెలుస్తోంది. అధిష్టానం దృష్టిని ఆకర్షించి, తిరిగి పార్టీలో తన ప్రాధాన్యతను చాటుకోవడానికి ఆమె ఈ ‘సైలెంట్ స్ట్రాటజీ’ని ఎంచుకున్నారా? లేక భవిష్యత్ రాజకీయ పరిణామాలకు అనుగుణంగా వేరే ఏదైనా నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారా? అనేది హాట్ టాఫిక్ గా మారింది. మరోవైపు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరక్క జిల్లా నేతలు తలలు పట్టుకుంటున్నారు.
Also Read: తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా ఫోన్.. ఆ విషయంలో సీరియస్ క్లాస్?