Kondareddypalli to become fully solar powered village: ఉన్న ఊరికి, కన్నతల్లికి ఎంత చేసినా తక్కువే అవుతుంది. నేడు అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా తమ సొంత ఊరికి న్యాయం చేయలేకపోతున్నారు. ఎక్కడో మారుమూల కుగ్రామం మహబూబ్ నగర్ జిల్లా, కొడంగల్ మండలంలోని కొండారెడ్డి పల్లికి ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుణ్యమా అని దాని రూపురేఖలే మారిపోనున్నాయి. తెలంగాణలోనే ప్రప్రధమంగా పూర్తి స్థాయి సోలార్ గ్రామంగా రూపొందబోతోంది. దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన ఊరు అది. బాల్యం, విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయాలలో అఖండ విజయాలను సొంతం చేసుకుని అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణకు రెండో సీఎంగా ఎన్నికయ్యారు.
సీఎం సంక్షేమ పథకాలు
తన సంక్షేమ పథకాల ద్వారా రోజురోజుకూ ప్రజలకు మరింత చేరువగా మారుతున్నారు రేవంత్ రెడ్డి. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తూ ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తున్నారు. రైతు రుణమాఫీ చేసి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అని చేసి చూపించారు. త్వరలో నేతన్నల సమస్యలను కూడా తీర్చేలా వారికి కూడా రుణ మాఫీని ప్రకటిస్తామంటున్నారు. ఇటీవల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. ఇలా పలు ప్రజా సంక్షేమ పథకాలతో చొచ్చుకుపోతున్నారు. అయితే తన స్వగ్రామం కొండారెడ్డి పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ లో ఉన్న కొండారెడ్డి పల్లిని తెలంగాణ రాష్ట్రానికే మోడల్ విలేజ్ గా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల బృందం అక్కడ ఇంటింటి సర్వే మొదలు పెట్టారు.
ప్రతి ఇంటికీ సోలార్ ప్యానల్
ప్రతి ఇంటి రూఫ్ పై సోలార్ ప్యానల్ అమర్చేవిధంగా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీఎం ఆదేశాలతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం అక్కడ స్థానిక గ్రామస్తులు, రైతులు, గ్రామ పెద్దలతో కలిసి మాట్లాడి ఈ ప్రాజెక్టు వివరాలను తెలిపారు. ప్రస్తుతం అక్కడ మొత్తం విద్యుత్ వినియోగించేవారు 1,451 మంది ఉన్నారు. కొండారెడ్డి పల్లి గ్రామానికిక సంబంధించి ఎంత విద్యుత్ వినియోగమవుతుంది..విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి ఆ నివేదికను త్వరలో సీఎం ముందుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు అధికారులు. దీనితో కొండారెడ్డి పల్లిలో ఇకపై ఉచితంగానే కరెంట్ సదుపాయం పొందవచ్చు. నెల నెలా కరెంట్ ఖర్చులు ఉండవని గ్రామస్తులు సంబరపడిపోతున్నారు. తమకు ఇలాంటి సదుపాయాలు కల్పిస్తున్న రేవంత్ రెడ్డిని మనసారా అభినందిస్తున్నారు.