Krishna Water Dispute: కృష్ణా నది జలాలపై తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఈ నెల 23 నుంచి 25 వరకు ఢిల్లీలో జరగబోయే.. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్–2 విచారణలో.. తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించేందుకు సన్నద్ధమవుతున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం స్వయంగా హాజరు
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. స్వయంగా హాజరవుతారని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో.. ఎలాంటి రాజీ పడమని, ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని సీఎం కట్టుబడి ఉన్నారు అని ఉత్తమ్ అన్నారు. ఇప్పటికే సీఎం అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీలో జరిగే సమీక్షలకు సమన్వయం చేయబోతున్నారని తెలిపారు.
బలమైన వాదనలకు సన్నాహాలు
శనివారం నాడు హైదరాబాదులోని జలసౌధలో న్యాయ నిపుణులు, నీటిపారుదల అధికారులు, సుప్రీం కోర్టు న్యాయవాది సి.ఎస్. వైద్యనాధ్ సమక్షంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా, ఆంధ్రప్రదేశ్ అక్రమ వినియోగాలు, సమైక్యాంధ్రలో జరిగిన అన్యాయాలపై సాక్ష్యాధారాలతో వాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు.
తెలంగాణ డిమాండ్లు
ఉత్తమ్ ప్రకారం, కృష్ణా జలాశయాల 811 టీఎంసీలలో తెలంగాణకు 71% వాటా రావాలని, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు కనీసం 65% కేటాయింపులు తప్పనిసరిగా ఉండాలని ట్రిబ్యునల్ ముందు ఉంచుతున్నామని చెప్పారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు, జూరాల ఫ్లడ్ ఫ్లో కాలువ వంటి ప్రాజెక్టుల అవసరాలను వాదనలో ప్రస్తావిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అక్రమాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, పట్టిసీమ, చింతలపూడి, పులిచింతల లాంటి ప్రాజెక్టుల ద్వారా కృష్ణా నీటిని అక్రమంగా మళ్లిస్తున్నదని ఆరోపించారు. సుమారు 291 టీఎంసీల నీటిని అన్యాయంగా వినియోగిస్తున్నారని, దీనిని పునర్విభజన చేయాలని తెలంగాణ వాదన వినిపిస్తుందని చెప్పారు.
చట్టపరమైన అంశాలు
1956 జలవివాద చట్టం, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్‌లు, అలాగే ISWRD చట్టంలోని సెక్షన్ 4(1)(a) ఆధారంగా వాదనలు చేస్తామని మంత్రి తెలిపారు. సుప్రీం కోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్, నదుల నిర్వహణ బోర్డు ల వద్ద కూడా ఆంధ్రప్రదేశ్ అన్యాయాలపై తెలంగాణ వాదనలు కొనసాగిస్తున్నదని ఆయన చెప్పారు.
గత పాలకులపై విమర్శలు
బీఆర్‌ఎస్ పాలనలో నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ తన వాటా.. నీటిని వినియోగించుకోలేకపోయిందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోజనం పొందేలా అలా జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. కృష్ణా జలాల విషయంలో గట్టి పట్టుదలతో ముందుకు వస్తోంది అని అన్నారు.
Also Read: స్కూల్ ముసుగులో మత్తు పదార్థాల దందా..
రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కృష్ణా జలాల ట్రిబ్యునల్–2లో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.