నాయకత్వం Vs వారసత్వం
అదే బాటలో గులాబీ పార్టీ..!
⦿ రాష్ట్రం ఏదైనా.. పార్టీ ఏదైనా.. కష్టపడితేనే నాయకుడు
⦿ తండ్రుల పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తే అధోగతే
⦿ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నో ఉదాహరణలు
⦿ ప్రధాన రాష్ట్రాల్లో కనుమరుగైన వారసులు ఎందరో
⦿ గెలుపోటములను నిర్దేశించేది ఆర్థిక బలం కాదు.. అంగ బలం
⦿ ప్రస్తుతం బీఆర్ఎస్‌లో వీటిపైనే జోరుగా చర్చ
⦿ వారసత్వమా.. నాయకత్వమా అంటూ తెరపైకి కొత్త వాదం
⦿ ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిన కేసీఆర్
⦿ కొడుకుని సీఎం చేసే కల ఇక నెరవేరదా?
⦿ కవిత యాక్టివ్ కావడం.. కేటీఆర్ వేసిన ప్లానా?
⦿ హరీష్ తప్ప అందర్నీ దారిలోకి తెచ్చుకోవడం వెనుక మతలబేంటి?
⦿ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో హరీష్ వ్యూహమేంటి?
⦿ బీఆర్ఎస్ నిట్టనిలువుగా చీలనుందా?
⦿ అదే జరిగితే నేతలు, కార్యకర్తలు ఎవరి వైపు?
⦿ ప్రాంతీయ పార్టీల్లో వారసత్వం, నాయకత్వం వార్‌పై స్వేచ్ఛ ప్రత్యేక కథనం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: BRS Party: ఏ రంగంలో చూసినా వారసుల హవా కామన్. కానీ, రాజకీయాల్లో వర్కవుట్ అయ్యే ఛాన్స్ చాలా అంటే చాలా తక్కువ. కాలం మారుతున్నా, సాంకేతికంగా ముందుకు వెళుతున్నా, ఇంకా పాతకాలపు రాచరిక పోకడలు రాజకీయాల్లో ఎక్కువవుతున్నాయి. వెనకటి రోజుల్లో ఏమోగానీ ప్రస్తుత పరిస్థితిలో వారసులను జనం అంత తేలిగ్గా ఒప్పుకోవడం లేదు. వారికంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఉండాలి.
ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. సమస్యలపై పోరాటాలు చేయగలగాలి. వారి నుంచి ఓ భరోసా ఇవ్వగలగాలి. లేకపోతే, వారసత్వం వర్సెస్ నాయకత్వం వార్ మొదలువుతుంది. దేశ రాజకీయాల్లోని చాలా పార్టీల్లో ఇలాంటి అంతర్గత యుద్ధాలు జరిగాయి. కొందరు వారసులు తెరమరుగయ్యారు కూడా. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో అలాంటి పరిస్థితే ఉందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది.
ఎక్కడ చూసినా వారసులే.. వివాదాలే
మహారాష్ట్రలో బాల్ థాక్రే వారసుడిగా ఉద్ధవ్ థాక్రే పార్టీ పగ్గాలు చేపట్టారు. కానీ, వారసత్వ రాజకీయాలతో పార్టీ ముక్కలైంది. షిండే రూపంలో నాయకత్వం వర్సెస్ వారసత్వం వార్ నడిచింది. శరద్ పవార్ ఎన్సీపీ పరిస్థితి కూడా అంతే. కుమార్తెను అందలం ఎక్కించాలని అనుకుంటే, పార్టీ రెండుగా చీలింది. దక్షిణాదిన చూసుకుంటే డీఎంకే స్థాపనలో కరుణానిధిది తిరుగులేని పాత్ర. ఆయన వారసుడిగా తర్వాత నాయకుడిగా స్టాలిన్ గుర్తింపు పొందడానికి చాలా కాలమే పట్టింది.
ఈయనకు అప్పుడప్పుడు అళగిరి, కనిమొళి రూపంలో షాకులు తగులుతుంటాయి. బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడిగా తేజశ్వి యాదవ్ ఉన్నారు. ఈయన అన్నతో విభేదాల కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయింది. యూపీలో సమాజ్ వాదీ పార్టీకి ములాయం సింగ్ యాదవ్ బలమైన పునాదులు వేశారు. ఆయన వారసుడిగా అఖిలేష్ యాదవ్ కొనసాగుతున్నారు. ఈయనకు పోటీ లేకపోయినా, వారసత్వ రాజకీయాలను జనం ఎక్కువకాలం ఒప్పుకోలేదు. ఆంధ్రాలో చంద్రబాబు వారసుడిగా లోకేష్ ఇంకా పూర్తిగా రాజకీయ పరిపక్వత సాధించలేదు.
ఇక వైఎస్ వారసుడిగా జగన్ వచ్చినా, చెల్లెలి రూపంలో వారసత్వ సమస్య ఎదురైంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ వారసుడిగా ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంట్రీ పార్టీలో చిచ్చు రాజేసింది. సీనియర్లు, జూనియర్లుగా విడిపోయి మమతకు తలనొప్పిగా తయారైంది. మాయావతి వారసుడిగా బీఎస్పీ భవిష్యత్తుగా చెప్పుకున్న ఆకాశ్ ఆనంద్ వల్ల కూడా పార్టీలో చిచ్చు రగిలింది. రెండు వర్గాలుగా విడిపోయారు నేతలు. ఇలా చెప్పుకుంటూ పోతే వారసత్వం వర్సెస్ నాయకత్వం యుద్ధం పలు పార్టీల తలరాతను మార్చేశాయి.
బీఆర్ఎస్‌లో ఎప్పటి నుంచో ముసలం
తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీలో సైతం వారసత్వ చిచ్చు ఎప్పటి నుంచో రగులుతోంది. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాలలో యాక్టివ్‌గా ఉండడం లేదు. ఈ గ్యాప్‌ను కేటీఆర్‌తో భర్తీ చేసేందుకు బాధ్యతలన్నీ అప్పగించారు. అయితే, కేసీఆర్ తర్వాత మేనల్లుడు హరీష్ రావు అనేది ఉద్యమ సమయం నుంచి ఉన్న మాట. కానీ, కేసీఆర్ పుత్రుడికే పట్టం కడుతూ వస్తున్నారు.
నెంబర్ టూ స్థానాన్ని కేటీఆర్‌కే ఇచ్చేందుకు పోటీగా ఎవరు వచ్చినా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారు. అలా చాలామంది లీడర్లు పార్టీని వీడారు. చివరకు హరీష్ రావుకు చాలాకాలం మంత్రి పదవి సైతం ఇవ్వలేదు. నిజానికి, అటు పార్టీలో, ఇటు రాష్ట్రంలో హరీష్ రావుకు ఉన్నంత గుర్తింపు కేటీఆర్ సాధించలేకపోయారు. హరీష్ మంచి అడ్మినిస్టేటర్‌గా ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డారు. అయితే, లిక్కర్ కేసులో జైలుపాలై బయటకొచ్చాక, చాలాకాలం ఎవరికీ కనిపించకుండా ఉన్న కవిత, ఈమధ్యే యాక్టివ్ అయ్యారు. దీని వెనుక కేటీఆర్ చతురత ఉందన్న చర్చ జరుగుతోంది.
కవిత యాక్టివ్ వెనుక పెద్ద వ్యూహమే
ప్రస్తుతం కేటీఆర్ చుట్టూ కేసుల ఉచ్చు చుట్టుకుంటోంది. అరెస్టులకు తాను భయపడనంటూ, త్వరలోనే పాదయాత్ర చేస్తానని అన్నారు. ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తే అప్పుడు హరీష్ రావు యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కేసీఆర్ అందుకు సుముఖంగా లేరు. అందుకోసమే అనూహ్యంగా కవితను రాజకీయాలలో యాక్టివ్ చేసినట్టుగా అనుకుంటున్నారు. ఒకవేళ కవితకు పొలిటికల్ మైలేజ్ వచ్చినా మళ్లీ అన్నకే మద్దతిస్తారు.
లేదంటే తానే అన్నీ చూసుకుంటారు. అదే హరీష్ రావు కనుక బలపడితే సొంత వారసత్వానికి పెద్ద ప్రమాదం. పైగా, ఈమధ్య ఏం చేసినా కేటీఆర్‌కు కలిసి రావడం లేదు. ప్రభుత్వంపై పోరాటంలో అన్నీ బూమరాంగ్ అవుతున్నాయి. కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నా, యూట్యూబ్ ఛానళ్లను నడిపిస్తున్నా రివర్స్ కొడుతున్నాయి. మొత్తంగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఫెయిల్ అయ్యారని పార్టీలో తెగ మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో కవితను తెరపైకి తీసుకురావడం, అదికూడా బీసీ మంత్రం అందుకోవడం పెద్ద వ్యూహంలో భాగంగా అనుకుంటున్నారు. కేటీఆర్ ఈమధ్య సంతోష్ సహా ఇతర కుటుంబసభ్యులతో చర్చలు జరిపి, అందర్నీ తనవైపు ఉండేలా చూసుకుంటున్నారట. అందుకే, కవిత సడెన్‌గా యాక్టివ్ అయ్యారని చర్చించుకుంటున్నారు.
వాట్ నెక్ట్స్ హరీష్?
ప్రస్తుతం హరీష్ రావు పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన ఎప్పటికీ నెంబర్ టూ గానే ఉండిపోవాలా? అని అభిమానులు అడుగుతున్నారు. ఇంకా పార్టీలో కొనసాగుతారా? లేక సొంతంగా పార్టీ పెడతారా? ఏదైనా జాతీయ పార్టీలో చేరతారా? లేక, పలు రాష్ట్రాల్లో జరిగిన ఉదాహరణలను ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారా? అనేది హాట్ టాపిక్ అయింది. నిజానికి, కేటీఆర్ తండ్రి చాటు బిడ్డగానే మిగిలిపోతుండడంతో హరీష్ రావుకు ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ దక్కుతుందనే ఆశతో ఆయన అభిమానులు ఉన్నారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటే హరీష్ ఉన్నారని, కేటీఆర్ మధ్యలో వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, పదేళ్లలో హరీష్ రావుకు ఉన్నంత సక్సెస్ రేటు కేటీఆర్‌కు లేదని అంటున్నారు. దీంతో హరీష్ రావు వర్సెస్ కేసీఆర్ కుటుంబం అనే కోణంలో వార్ జరుగుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు పార్టీ మారతారా, అదే పట్టుతో బీఆర్ఎస్‌ను కైవసం చేసుకుంటారా? అనేది చర్చనీయాంశమైంది