KTR Political Strategies : గత ప్రభుత్వ నిర్ణయాలపై వరుస సమీక్షలు చేస్తున్న రేవంత్ సర్కార్.. అనేక విషయాల్లో తప్పుల్ని గుర్తిస్తూ ఎంక్వైరీలు జరుపుతోంది. వాటిలో.. హైదరాబాద్ లో నిర్వహించిన.. ఫార్ములా-ఈ రేసుల అంశం ఒకటి. ఇందులో ప్రభుత్వ సొమ్మను ఇష్టానుసారం ఖర్చు చేశారనేది ప్రభుత్వ వాదన.. అయితే, తెలంగాణా బ్రాండ్ ఇమేజ్ కోసమే రేసులు నిర్వహించామని చెబుతున్న కేటీఆర్.. కావాలంటే తనను అరెస్ట్ చేసేకోండి అంటూ వ్యాఖ్యానించారు. ఆ రేసుకు సంబంధించి పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించారు. ఇలా కేటీఆర్ ముందే ఎందుకు స్పందించారు.? అరెస్ట్ చేయండి, జైలుకు పంపండి అని ఎందుకు ప్రకటించారు.? అసలు.. బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలేంటి.?
గతేడాది.. ఫిబ్రవరిలో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా – ఈ రేసుల్లో కనీస నిబంధనల్ని పాటించలేదని, కొందరు నేతల స్వలాభం కోసమే రేసు నిర్వహించారని ప్రభుత్వాధినేతలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే.. నగరంలో రేసుల నిర్వహణను రద్దు చేసిన ప్రభుత్వం. గతంలో జరిగిన రేసుల విషయమై సమగ్ర దర్యాప్తు జరుపుతోంది. ఈ సమయంలోనే మీడియా ముందుకు వచ్చిన కేటీఆర్.. అంతా నేనే చేశా, కావాలంటే అరెస్ట్ చేసుకోండి అంటూ ప్రకటించారు. అధికారుల తప్పదం ఏం లేదని, తానే సంతకాలు చేసి డబ్బులు విడుదల చేశానని ప్రకటించారు. తనని జైలుకు పంపిస్తే.. యోగా చేసి స్లిమ్ గా మారి వస్తానన్న కేటీఆర్.. బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. కేటీఆర్ ఈ మాటల వెనుక.. ఆ పార్టీ అనుసరించనున్న వ్యూహాలపై చాలా మంది విశ్లేషలు చేస్తున్నారు.
ఈ కేసులో ఏవైనా తప్పులు దొర్లితే.. ప్రభుత్వం నుంచి అరెస్టులు తప్పదని గ్రహించిన కేటీఆర్.. ముందే శ్రేణులకు, ప్రజలకు.. తన తప్పు లేకపోయినా.. ప్రభుత్వం కావాలని చేసిందని చెప్పుకునేందుకు ఇది ఓ వ్యూహం అంటున్నారు. అలాగే.. ఏదో ఓ ఆసక్తికర కామెంట్లు చేసి నిత్యం ప్రజల్లో ఉండేలా కేటీఆర్ ప్లాన్ చేశారన్నది మరికొందరి విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి.. ఇంకా ఏడాది కూడా కాకపోవడం, విమర్శించేందుకు సరైన కారణాలు లభించని తరుణంలో ఇలాంటి కామెంట్ల ద్వారా ప్రచారంలో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారనేది కొందరి మాట.
స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన.. బీఆర్ఎస్ పార్టీ, మొన్నటి ఎన్నికల్లో ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఓటమి పాలైంది. దాంతో.. తిరిగి అభివృద్ధి, అవినీతిపై మాట్లాడితే.. ఆ మాటలు తమకే తగులుతాయనే భయంలో ఉన్నారని, ఈ కారణంగానే.. అందరి దృష్టి మరల్చే విధంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.
Also Read : Bandi Sanjay: కేసిఆర్ రెస్ట్.. కేటీఆర్ యాక్టింగ్.. బీఆర్ఎస్ ఖాళీ ఖాయం.. జోస్యం చెప్పిన బండి సంజయ్
మొన్నటి ఎన్నికల వరకు అన్ని ప్రాంతాల్లో బలమైన నాయకులతో కిక్కిరిసిపోయిన కారు పార్టీ.. ఒటమి తర్వాత గ్రామస్థాయిల నుంచి బలహీనపడుతోంది. కీలక నాయకులు కారు దిగిపోవడంతో పాటు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో.. సాధారణ కార్యకర్తలు వేరే పార్టీల వైపు అనివార్యంగా చూస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కేటీఆర్.. తనను అరెస్ట్ చేసుకోండి అంటూ వ్యాఖ్యానించి.. సాధారణ కార్యకర్తల సెంటిమెంట్లను రగిలించాలనే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. పార్టీలో మళ్లీ ఉద్యమ తీవ్రతను, ఉద్వేగాన్ని నింపి.. కార్యకర్తలు పార్టీలు మారకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జైలుకెళితే సీఎం అవ్వచ్చనే సెంటిమెంటా.?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు కాలం నుంచి ఇప్పటి వరకు.. పాదయాత్ర పై రాజకీయ వర్గాల్లో మంచి అభిప్రాయం ఉంది. ఎన్నికల నాటికి పాదయాత్ర చేస్తే, తప్పకుండా విజయం వస్తుందనే నమ్మకం ఉంది. అది.. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా సాగుతూనే ఉంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత చంద్రబాబు.. ఈ ఫార్ములాను అనుసరించగా, ఆ తర్వాత జగన్, మొన్నటి ఎన్నికల్లో అటు నారా లోకేష్, ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్రల ద్వారా అధికారాన్ని చేపట్టారు. ఇప్పుడు.. ఇదే సూత్రాన్ని ఫాలో అవ్వాలని చూస్తున్నారు.. కేటీఆర్. దీంతో పాటే.. జైలుకెళ్లిన నేతలకు తర్వాత కాలంలో సీఎం పీఠాలు లభిస్తుండడంతో… తాను జైలుకు వెళ్లి రావాలని కోరుకుంటున్నారని.. వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.. కొందరు నెటిజన్లు.