KTR on Kaleshwaram High Court: కాళేశ్వరం విచారణపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన ఘోరాతి ఘోరమైన అబద్ధపు ప్రచారానికి ఈ తీర్పు చెంపపెట్టు అని ఆయన అభివర్ణించారు. “నిజం నిలకడగా తెలుస్తుందని అనడానికి నేటి కోర్టు తీర్పే నిదర్శనం.” అని పేర్కొన్న కేటీఆర్, అబద్ధానికి ఆడంబరం ఎక్కువ కానీ ఆయుస్సు తక్కువని ఎద్దేవా చేశారు. పిట్టల దొరల్లాగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు న్యాయస్థానం సరైన సమాధానం చెప్పిందని, కూలింది కాళేశ్వరం కాదు.. వారి మోసపూరిత ప్రచారమని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తీరును కేటీఆర్ తప్పుబట్టారు. ఆనాడే తాను ఆ కమిషన్‌ను “పీసీ ఘోష్ కమిషన్ కాదు.. పీసీసీ ఘోష్ కమిషన్” అని విమర్శించానని గుర్తు చేశారు. 94 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ అనేది ఒక చిన్న భాగం మాత్రమేనని, అందులో రెండు పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని రాహుల్ గాంధీ వంటి “తెలివి తక్కువ దద్దమ్మలు” ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 400 కోట్ల రూపాయల నష్టానికి సంబంధించి ఎల్ అండ్ టీ (L&T) సంస్థ బాధ్యత తీసుకుంటానని ముందుకు వచ్చినా, ప్రభుత్వం వారిని బెదిరించిందని ఆరోపించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కలిసే పని చేస్తున్నాయని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో చెక్ డ్యాంలు పేలిపోతున్నా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీ (SLBC) పనుల్లో ఎనిమిది మంది కార్మికులు చనిపోయినా ఎన్‌డీఎస్‌ఏ (NDSA) బృందం ఎందుకు రాలేదని నిలదీశారు. అమృత్ స్కీమ్, ఓటుకు నోటు కేసుపై విచారణ జరిపించే దమ్ము బీజేపీకి ఉందా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాపాడటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఉగ్రవాది కసబ్ లాగే కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పైన కూడా కేటీఆర్ స్పందించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పెద్దలే ప్లాన్ చేశారేమో అన్న అనుమానం కలుగుతోందని, కార్మికులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్ని కమిషన్లు వేసినా, తెలంగాణలో పండుతున్న ప్రతి పంటా కేసీఆర్ చేసిన కృషిని గుర్తు చేస్తూనే ఉంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ తీర్పు తెలంగాణ రైతుల విజయమని, తమ వాదనలను కోర్టులో సమర్థవంతంగా వినిపించిన న్యాయ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు.. ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా!