KTR Secret Tour: ఈ మధ్యకాలంలో కేటీఆర్ చేపడుతున్న విదేశీ పర్యటనలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆయన వరుసగా వెళ్తున్న ఫారిన్ టూర్లు.. వివాదాస్పదమవుతున్నాయి. మొన్నటికి మొన్న అమెరికా వెళ్లారు.. తాజాగా లండన్ వెళ్లారు. ఈ టూర్లమీదే.. ఇప్పుడు రాజకీయ రచ్చ నడుస్తోంది. అసలు.. కేటీఆర్ విదేశీ పర్యటనలపై ఎందుకింత రాద్ధాంతం? అక్కడికి వెళ్లి ఆయనేం చేస్తున్నారు? విపక్ష పార్టీల విమర్శలేంటి? ప్రత్యర్థుల ఆరోపణలేంటి?
కేటీఆర్ విదేశీ పర్యటనలపై రాజకీయ దూమారం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశీ టూర్లకు వెళ్లడం కొత్తేమీ కాదు. అధికారంలో ఉన్న సమయంలో.. చాలాసార్లు విదేశాల్లో పర్యటించారు. కానీ.. అధికారం కోల్పోయిన తర్వాత.. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో.. కేటీఆర్ విదేశీ పర్యటనలపై రాజకీయ దుమారం రేగుతోంది. అసలు.. కేటీఆర్ విదేశాలకు వెళితే.. రాజకీయంగా రగడ ఎందుకు మొదలవుతోంది? గతంలో లేని వివాదాలు ఇప్పుడే ఎందుకొస్తున్నాయనే చర్చ మొదలైంది. ఇటీవలి అమెరికా టూర్, లేటెస్ట్ లండన్ టూర్లపైనే ఇప్పుడు రచ్చంతా! కేటీఆర్ విదేశీ పర్యటనలకు.. వివిధ కేసులతో లింక్ ఉండటమే.. రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారుతోందని చెబుతున్నారు.
హాట్ టాపిక్‌గా మారిన కేటీఆర్ అమెరికా టూర్
పోయిన నెలలో కేటీఆర్ అమెరికాలో పర్యటించారు. కేటీఆర్ యూఎస్‌కు వెళ్లిన సమయంలో.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. అమెరికాలోనే ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో.. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయత్నాల్లో ప్రభాకర్ రావు ఉన్నారు. సరిగ్గా.. ఇదే సమయంలో.. కేటీఆర్ అమెరికాలో పర్యటించడం పొలిటికల్‌గా.. హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాకర్ రావు ఇండియాకు రావడం వెనుక.. కేటీఆర్ అక్కడికి వెళ్లడం వెనుక ఏదో వ్యూహం ఉందనే చర్చ నడిచింది. ప్రభాకర్ రావు భారత్‌కు తిరిగి రావడానికి కొన్ని రోజుల ముందు.. కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్లారని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అమెరికాలో కేటీఆర్‌తో మాట్లాడిన తర్వాతే.. ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చారని బండి సంజయ్ ఆరోపించారు.
కేటీఆర్ లండన్ పర్యటనపైనా రాజకీయ వివాదం!
ఓ పక్కన అమెరికా టూర్ వివాదం నడుస్తున్న సమయంలోనే.. మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు కేటీఆర్. దాంతో.. కల్వకుంట్ల తారక రామారావు లండన్ పర్యటనపైనా రాజకీయం వివాదం మొదలైందనే చర్చ జరుగుతోంది. ఫార్ములా-ఈ రేసు కేసులో నిందితుడైన.. ఐఏఎస్ అర్వింద్ కుమార్ లండన్ పర్యటనలో ఉన్నారు. ఇదే కేసులో.. ఏసీబీ విచారణకు హాజరైన తర్వాత.. కేటీఆర్ లండన్ పర్యటనకు వెళ్లారు. దాంతో.. కేటీఆర్ లండన్ టూర్.. రాజకీయ రగడకు దారితీసిన పరిస్థితి నెలకొంది. కేటీఆర్ లండన్ పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేటీఆర్ పర్యటనని.. ఫార్ములా-ఈ కేసులో సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నంగా చిత్రీకరించారు. కేటీఆర్, అర్వింద్ కుమార్‌ని లండన్‌లో కలిసి.. కేసును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు చామల.
కేటీఆర్ విదేశాల్లోనే మేనేజ్ చేస్తున్నారని విపక్షాల ఆరోపణలు
కేటీఆర్ లండన్ పర్యటనలో.. కచ్చితంగా అర్వింద్ కుమార్‌తో ఫార్ములా-ఈ కేసు సంబంధింత చర్చలు జరుగుతాయని.. బీజేపీ నేతలు కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా.. కేటీఆర్ విదేశీ పర్యటనలపై విమర్శలు చేస్తూ.. బీఆర్ఎస్‌ని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. కానీ.. గులాబీ పార్టీ మాత్రం.. ప్రత్యర్థి పార్టీల ఆరోపణల్ని కొట్టిపారేస్తోంది.