KTR Vs Sanjay: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం కొత్త మలుపులు తిరుగుతోందా? ఈ కేసు మూడు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిందా? దీనిపై రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసిందా? అందుకే కేంద్రమంత్రి బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ అంశం తారాస్థాయికి చేరింది. సిట్ విచారణకు హాజరైన తర్వాత రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు మీడియా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటికే చాలామందిని సాక్షులుగా పిలిచి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది.
గతవారం కేంద్రమంత్రి బండి సంజయ్ సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. సిట్ ఎలాంటి ప్రశ్నలు రైజ్ చేసిందనే అంశాన్ని కాసేపు పక్కనబెడదాం. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు సదరు మంత్రి. ఆయన చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ నోటీసులు పంపించారు. ఆ ఆరోపణలు నిరాధారమైనవి, దురుద్దేశ పూరితమైనవని కేటీఆర్ న్యాయవాదులు ఆ నోటీసులో పేర్కొన్నారు.
బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేశారని, ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆ నోటీసులపై వారంలోకా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రస్తావించారు.
ALSO READ: హైదరాబాద్‌లో ఖజానా జ్యువెలర్స్ దోపిడీకి ప్లాన్, సిబ్బందిపై కాల్పులు
బండి సంజయ్ చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని నోటీసులో వెల్లడించారు. భవిష్యత్తులో కేటీఆర్, అతని కుటుంబ సభ్యులపై ప్రత్యక్షం, పరోక్షంగా ఎలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఉన్నట్లుండి బీఆర్ఎస్ ఈ తరహా స్టాండ్ తీసుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై చీటికి మాటికీ నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారిందని, అందుకే కేటీఆర్ నోటీసులు ఇచ్చారన్నది ఆ పార్టీ వర్గాల మాట. దీనివల్ల మిగతా నేతల మాటలకు తాళం పడుతుందని భావిస్తోంది.