KTR: ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైడ్రా వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హైడ్రా అనేది సీఎం చేతిలో బ్లాక్‌మెయిలింగ్, వసూళ్ల సాధనంగా, తొమ్మిది తలల విషసర్పంలా మారిందని ధ్వజమెత్తారు. పేదల ఇళ్లను కూల్చి వేస్తూ వేలాది కుటుంబాలను రోడ్డున పడేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీస్తున్నారని.. కానీ ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని మండిపడ్డారు.
పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరొకలా?
హైడ్రా వేటకుక్కలా మారీ సామాన్యులను భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. బిల్డర్లను బెదిరించి నిధులు గుంజుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తనను తాను ‘హిట్లర్’ గా భావిస్తున్నారని విమర్శించారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఆక్రమణలో ఉన్న శిఖం భూములు ఏమయ్యాయని, ఆయన ఇల్లుతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేంద్ర రెడ్డి, మంత్రి వివేక్ నివాసాలను ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే కోర్టు సూచనల మేరకు హైడ్రాను రద్దు చేసి బంగాళాఖాతంలో విసిరేస్తామన్నారు. ఇక బీఆర్ఎస్ దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత భూముల విస్తీర్ణం, కాంగ్రెస్ కమిషన్ల దందాల కోసం ఏకంగా కోటి ఎకరాలకు పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీలిమిటేషన్‌పై డిమాండ్
లోక్‌సభ సీట్ల పునర్విభజన విధానంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను నిర్ణయిస్తే.. దేశహితం కోసం కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైల్వే, ఐటీ ప్రాజెక్టులపై కేంద్రానికి వినతులు
తెలంగాణ ప్రజల తరఫున కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి కేటీఆర్ వినతిపత్రం సమర్పించారు. 2 వేల కిలోమీటర్ల ట్రాక్ అర్హత ఉన్న కాజీ పేటను తక్షణమే రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగూడెం డివిజన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోరారు. దాంతో పాటు హైదరాబాద్–కరీంనగర్ రైల్వే లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: ఎంతటి వారినైనా.. అస్సలు వదిలిపెట్టం.. హైడ్రా వివాదంపై సీఎం క్లారిటీ!