KTR: బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? కారులో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయా? కీలక నేతలు రెస్ట్ పేరిట దూరంగా ఉంటున్నారా? కేసీఆర్, కవిత బాటలో కేటీఆర్ నడుస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీని లీడ్ చేసేదెవరు? ఇవే ప్రశ్నలు చాలామంది వెంటాడుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కీలక నేతలు దూరంగా ఉంటున్నారు. కారణం ఏమైనా కావచ్చు.. తొలుత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ వ్యవహారాలకు దూరమయ్యారు.
ఒక్కమాటలో చెప్పాలంటే అసెంబ్లీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. బయటకు రాలేదు.. ఎక్కడ ప్రసంగాలు చేయలేదు. ఒకవిధంగా చెప్పాలంటే రాజకీయాలకు విరామం ప్రకటించినట్టేనని కొందరి మాట.
కేసీఆర్ దూరంగా ఉండడంతో బాధ్యతలను మోస్తూ వస్తున్నారు కేటీఆర్. అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేవనెత్తిన పలు అంశాలు బూమరాంగ్ అయ్యాయి. మూసీ, లగచర్ల, దిలావర్‌పూర్ వంటి అంశాలు రివర్స్ అయ్యాయి. వీటిపై సరైన స్పందన లేకపోవడంతో అసహనంలో ఉన్నారట కేటీఆర్.
ఈ క్రమంలో కొద్దిరోజులు రాజకీయాలకు విరామం ఇవ్వాలని కేటీఆర్ నిర్ణయం తీసుకోవడం, ఈ విషయాన్ని బయట పెట్టడం జరిగిపోయింది. వెల్ నెస్ రిట్రీట్ కోసం కొన్ని రోజులు వెళ్తున్నానంటూ ‘ఎక్స్’వేదికగా వెల్లడించారు కేటీఆర్.
ఏడాదిగా పార్టీని నడపడంలో కేటీఆర్ విఫలమయ్యారంటూ ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన స్మాల్ బ్రేక్ చెప్పడంపై చర్చించుకోవడం నేతల వంతైంది. విరామం తాత్కాలికమేనా? రాజకీయ సన్యాసమా? అంటూ ప్రత్యర్థుల నుంచి కామెంట్లు పడిపోతున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం కేసీఆర్ దీక్ష దివాస్ కార్యక్రమం నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ. నేతల, కార్యకర్తల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదట. కొన్ని చోట్ల కేడర్-నేతల మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే స్మాల్ బ్రేక్ అని కేటీఆర్ చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
రాజకీయాలకు కేటీఆర్ విరామం సమయంలో హైదరాబాద్‌లో ఉంటారా? లేక విదేశాలకు వెళ్తున్నారా? అన్న డౌంట్‌ని వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీలో ఈ మధ్య నేతల మధ్య చిన్నపాటి చర్చ జరిగిందట. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను ఎదుర్కొన్నట్టుగా ఇప్పుడు ఫేస్ చేయలేక పోతున్నామని కొందరు వాపోయారట. మనకు మిగతా పార్టీల మాదిరిగా ఎన్నికల వ్యూహకర్త ఉంటే బాగుంటుందని పార్టీ దృష్టికి తెచ్చారట. దీనిపై కేటీఆర్ సైలెంట్ అయిపోయారని అంటున్నారు.
విరామం సమయంలో అటువైపు కేటీఆర్ దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతకీ బీఆర్ఎస్ నేతల మదిలో ఏముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు. ఈలోగా కేటీఆర్ గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
కేటీఆర్ విరామం తర్వాత పార్టీని ఎవరు లీడ్ చేస్తారు? హరీష్‌రావు? లేక కవితక్కా? ఎవరు రంగంలోకి దిగుతున్నారు? హరీష్‌రావు వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతుందన్నది కొందరి మాట. ఈ గ్యాప్‌ని కవితక్క తీసుకుంటుందా? లేదా అన్నది చూడాలి.
రాజకీయాలకు కేటీఆర్ తాత్కాలిక విరామం
వెల్ నెస్ రిట్రీట్ కోసం కొన్ని రోజులు వెళ్తున్నానంటూ 'ఎక్స్' వేదికగా ప్రకటించిన కేటీఆర్
లగచర్ల, దిలావర్‌పూర్ ఘటనలతో బూమరాంగ్ అవడంతో అసహనంలో కేటీఆర్ @KTRBRS @BRSparty #KTR #BRS #Bigtv pic.twitter.com/B2jOfIU7Fv
— BIG TV Breaking News (@bigtvtelugu) November 30, 2024