KTR Delhi Tour: తమకు రాజకీయాల కంటే.. తెలంగాణ రాష్ట్రం, ప్రగతి ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసి ఐటీ రంగానికి సంబంధించిన కొన్ని అంశాలతో పాటు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని, సౌత్ సెంట్రల్ రైల్వేను పునర్విభజన చేసే కార్యక్రమం ప్రస్తుతం నడుస్తున్నదని తెలిపారు. ఆ నేపథ్యంలో కాజీపేట కేంద్రంగా ఒక కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు.
తాము ప్రతిపాదిస్తున్న రైల్వే డివిజన్‌లో కాజీపేట – బల్లార్షా, పెద్దపల్లి – నిజామాబాద్, కాజీపేట – ఎర్రుపాలెం, డోర్నకల్ – మణుగూరు, మోతమర్రి – విష్ణుపురం, కాజీపేట – వంగపల్లి సెక్షన్లు ఉండాలని సూచించామని కేటీఆర్ అన్నారు. ఈ ప్రతిపాదిత కాజీపేట రైల్వే డివిజన్‌కి సుమారు 2,000 ట్రాక్ కిలోమీటర్ల పరిధి ఉండే అవకాశం ఉందన్నారు. అయితే రైల్వే ఉద్యోగులు కూడా ఈ అంశానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారన్నారు. కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే.. అనేక ప్రయోజనాలు కలుగుతాయని అలాగే కొత్తగూడెం రైల్వే డివిజన్ ఏర్పాటు పరిశీలన చేయాలని కోరామన్నారు.
మరోవైపు మనోహరాబాద్ – సిద్దిపేట – సిరిసిల్ల – వేములవాడ చొప్పదండి నియోజకవర్గ మీదుగా కొత్తపల్లి న్యూ బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేట – సిరిసిల్ల – వేములవాడ – కొత్తపల్లి మధ్య మిగిలిన 75 కిలోమీటర్ల పనులు పూర్తిగా మందగించాయని.. ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించకపోవడమే ఇందుకు కారణమన్నారు.
Also Read: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. అధికారులకు కీలక సూచనలు!
అటు సిరిసిల్ల, వేములవాడ రైల్వే స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకంలో చేర్చి ఆధునికీకరించాలని రైల్వే మంత్రిని కేటీఆర్ కోరారు. మిడ్ మానేరు రిజర్వాయర్‌పై రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జికి ఆమోదం తెలపాలని, కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే లైన్ మొత్తాన్ని విద్యుదీకరించాలని విజ్ఞప్తి చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక హై-లెవల్ కమిటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టును నిరంతరం సమీక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి కేంద్రం ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
Also Read: 35వ అంతస్తులో ట్రాప్… పావురాన్ని పీక్కు తిని, వర్షపు నీళ్ళు తాగి బతికే కుర్రాడు