Survival Thriller: ఒక ఇంట్లో పొరపాటున చిక్కుకుపోతే బయట పడేందుకు ఎంతసేపు ప్రయత్నిస్తాం? గంట… రెండు గంటలు… కానీ అదే రోజుల తరబడి బయటకు రావడానికి అవకాశం లేకపోతే ? తినడానికి ఆహారం లేదు… తాగడానికి నీళ్లు లేవు… సహాయం చేసే మనిషి కూడా లేడు. అలాంటి భయంకరమైన పరిస్థితిని అత్యంత సహజంగా చూపించిన బాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్ ‘Trapped’. రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠను కొనసాగిస్తుంది. ఎలాంటి భారీ యాక్షన్ లేకుండా, ఒకే అపార్ట్‌మెంట్‌లో జరిగే కథతో ప్రేక్షకుడిని సీట్ అంచున కూర్చోబెడుతుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
శౌర్య ముంబైలో ఉద్యోగం చేసే యువకుడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ఒక ఇల్లు ఉండాలని భావిస్తాడు. తక్కువ అద్దెకు దొరికిన ఒక కొత్త ఫ్లాట్‌ను తీసుకుని అక్కడికి మారిపోతాడు. అయితే అది ఇంకా పూర్తిగా కట్టని భారీ అపార్ట్‌మెంట్. మొత్తం బిల్డింగ్ లో అతను తప్ప మరెవరూ ఉండరు. కొత్త ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే అతని జీవితాన్ని మార్చేసే ఘటన జరుగుతుంది. అవసరమై బయటకు వచ్చిన శౌర్య… పొరపాటున తలుపు లాక్ చేసుకుంటాడు. తాళం చెవి లోపల కాదు… బయటే ఉండిపోతుంది. తలుపు తెరవడానికి ఎంత ప్రయత్నించినా ఉపయోగం ఉండదు.
అంతలో మరో షాక్ ఎదురవుతుంది. అతని మొబైల్ ఫోన్ బ్యాటరీ పూర్తిగా అయిపోతుంది. ఎవరికి కాల్ చేసే అవకాశం కూడా ఉండదు. కొద్దిసేపటికే ఫ్లాట్‌లో విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. నీటి సరఫరా కూడా నిలిచిపోతుంది. సహాయం కోసం బాల్కనీలో నుంచి ఎంత గట్టిగా అరచినా 35వ అంతస్తు ఎత్తు, కింద ట్రాఫిక్ శబ్దం వల్ల ఎవరికీ అతని కేకలు వినిపించవు. రోజులు గడిచే కొద్దీ ఆకలి, దాహం అతన్ని తీవ్రంగా వేధిస్తాయి. దాహంతో అలమటిస్తున్న శౌర్య బాల్కనీలో పడే వర్షపు నీటిని సేకరించి తాగడం ప్రారంభిస్తాడు. ఆహారం లేక బలహీనపడిపోతాడు. చివరకు బతకడం కోసం బాల్కనీలోకి వచ్చే పావురాలను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. పరిస్థితి మరింత దారుణంగా మారడంతో చీమలు, బొద్దింకలు వంటి పురుగులను కూడా తినాల్సిన పరిస్థితి వస్తుంది.
అయినా శౌర్య ఆశ వదులుకోడు. ఫ్లాట్‌లో దొరికిన ప్రతి వస్తువును ఉపయోగించి బయటపడే మార్గాల గురించి ఆలోచిస్తాడు. ఒక్కో ప్రయత్నం విఫలమైనా మళ్లీ మరో మార్గం వెతుకుతాడు. బతకాలి అనే ఒక్క లక్ష్యంతో తన శారీరక, మానసిక శక్తినంతా ఉపయోగిస్తాడు. చివరికి శౌర్య ఆ అపార్ట్‌మెంట్ నుంచి బయటపడగలిగాడా? అతని కోసం ఎవరైనా వెతికారా? ప్రాణాల కోసం చేసిన పోరాటం ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే ట్రాప్డ్ మూవీ.
ట్రాప్డ్ చిత్రంలో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించారు. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ సినిమా తన సహజమైన కథనం, రాజ్‌కుమార్ రావు నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. ఒక్క మనిషి… ఒక్క అపార్ట్‌మెంట్… కానీ చివరి వరకు ఉత్కంఠను తగ్గనివ్వని సర్వైవల్ థ్రిల్లర్ చూడాలనుకుంటే…మీ వాచ్‌లిస్ట్‌లో తప్పకుండా ఉండాల్సిన సినిమా ఇది.
Read Also: కొత్తగా చేరిన పోలీస్ ఆఫీసర్ కు చెమటలు పట్టించే ఊరు… తెలుగులోనే ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్