KTR Delhi Tour: రేవంత్ సర్కార్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోందా? రేపో మాపో అరెస్టులు ఖాయమా? గవర్నర్ పర్మీషన్ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందా? మలేషియా టూర్ క్యాన్సిల్ చేసుకుని కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్టు? ఫార్ములా రేస్ నుంచి తప్పించుకునేందుకు ఈ స్కెచ్ వేశారా? అర్థరాత్రి జరిగిన చర్చ సక్సెస్ అయ్యాయా? అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.
రేపో మాపో మాజీమంత్రి కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది. మలేషియా టూర్‌ని క్యాన్సిల్ చేసుకున్న కేటీఆర్, మీడియా ముందుకొచ్చారు. అరెస్టు వార్తలపై ఆయన నోరు విప్పారు. జైలుకి వెళ్లేందుకు తాను సిద్ధమేనంటూ చిలక పలుకులు పలికారు.
జైలులో జిమ్ చేసుకుంటే పాదయాత్ర చేయడానికి బాగుంటుందని మనసులోని మాట బయటపెట్టారు కేటీఆర్. అయితే ఫార్ములా రేస్ ఊబి నుంచి కేటీఆర్ బయటపడడం అసాధ్యమన్నది ప్రభుత్వ వర్గాల భోగట్టా. ఎందుకంటే ప్రభుత్వం, ఆర్బీఐ రూల్స్‌ని అధిగమించి డబ్బులు ఇచ్చారన్నది అసలు పాయింట్.
కేసీఆర్ సలహా మేరకు ఎకాఎకిన సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి పయనమయ్యారు. అమృత టెండర్ల విషయంలో కేంద్రమంత్రి ఖట్టర్ అపాయింట్మెంట్ కోరామని బయటకు చెప్పారు. సోమవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కేటీఆర్ కలిసినట్టు వార్తలు జోరందుకున్నాయి.
ALSO READ: ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు..! పోలీసుల లిస్ట్ లో నెక్స్ట్ ఉంది వీళ్లేనా?
ఈ వ్యవహారంపై ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీలో కారు పార్టీని విలీనం చేయాలని మెలిక పెట్టారట కమలనాథులు. విలీనం కంటే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ అధికారంలోకి వచ్చేలా సహకరిస్తామని యువనేత అన్నట్లు దాని సారాంశం.
ఈ గుసగుసల వెనుక నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే మాజీ మంత్రి అరెస్ట్ చేయడానికి గవర్నర్ నుంచి అనుమతి రావాల్సివుంది. ఒకవేళ గవర్నర్ నుంచి అనుమతి రాకుంటే డీల్ కుదిరినట్టేనని అంటున్నారు.
ఢిల్లీలో కేటీఆర్ మాటలను గమనించిన ఆ పార్టీ నేతలు.. కమలంతో బంధం మరింత బలపడిందని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, సోషల్ మీడియా కేసుల విషయంలో రేవంత్ ప్రభుత్వం టచ్ చేయకుండా అంతా సెట్ చేసుకున్నారట.
మరో విషయం ఏంటంటే.. కొద్దిరోజుల కిందట ఫారెన్ టూర్ వెళ్లారు కేటీఆర్. ఈ క్రమంలో ప్రభాకర్‌రావు ఇండియాకు రాకుండా గ్రీన్ కార్డు ఇప్పించడానికి తెరవెనుక తనవంతు ప్రయత్నాలు చేశారట. ఈ క్రమంలో అమెరికా ఎన్నికల ఫలితాలు తర్వాత గ్రీన్‌కార్డు వ్యవహారం బయటకు వచ్చిందని అంటున్నారు. మొత్తానికి రేవంత్ సర్కార్ ఉచ్చు నుంచి బీఆర్ఎస్ కీలక నేతలు దాదాపుగా బయటపడినట్టే.