Kukatpally Nallacheruvu: హైదరాబాద్ నగరానికి అద్దం పట్టేలా కూకట్‌పల్లి నల్లచెరువు ఇప్పుడు తన అందాలతో ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు చెత్తతో, మురికితో నిండిపోయి దుర్వాసనతో ఊహించలేనంత దయనీయ పరిస్థితిలో ఉన్న ఈ చెరువు, ఇప్పుడు అహ్లాదకర వాతావరణంలో విశ్రాంతి తీసుకునేలా మారిపోయింది. వర్షాల కారణంగా నీటితో నిండిపోయిన ఈ చెరువులో ఇప్పుడు పడవ ప్రయాణాలు మొదలైపోయాయి. 4 నెలల్లోనే చెరువును పూర్తిగా మార్చిన హైడ్రా అధికారులు చేసిన కృషి స్థానికుల హృదయాలను గెలుచుకుంది.
హైడ్రా అధికారులు, రెవెన్యూ శాఖ, స్థానిక నాయకులు అందరూ కలిసి పనిచేయడంతో ఈ చెరువు అభివృద్ధి సాధ్యమైంది. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ మాట్లాడుతూ, ఈ చెరువును తిరిగి పునరుద్ధరించడం సులభం కాదు. అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో వరదల సమస్య తగ్గుతుందని, ఎండాకాలంలో భూగర్భ జలాల స్థాయి పెరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.
ఒకప్పుడు కేవలం 16 ఎకరాల్లో మాత్రమే మిగిలిపోయిన ఈ చెరువు, ఆక్రమణలను తొలగించడం ద్వారా ఇప్పుడు దాదాపు 28 ఎకరాల వరకు విస్తరించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలను, దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించారు. లోతు పెరగడంతో చెరువులోని దుర్వాసన కూడా తొలగిపోయింది. కేవలం ఒకటి రెండు వర్షాలతోనే చెరువు నిండిపోవడం, ఈ ప్రాజెక్ట్ ఎంత సమర్థవంతంగా అమలయ్యిందో నిరూపిస్తోంది.
చెరువు చుట్టుపక్కల నివాస ప్రాంతాల సమస్యలను పరిష్కరించడంలో హైడ్రా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వర్షపు నీరు చెరువులోకి సులభంగా చేరేలా 7 ఇన్‌లెట్లు ఏర్పాటు చేశారు. చెరువు నిండిపోయినప్పుడు నీరు సులభంగా బయటకు వెళ్లేలా పాత ఔట్‌లెట్‌ను అభివృద్ధి చేసి, కొత్త ఔట్‌లెట్ నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇకపై చెరువు చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో వరద భయం ఉండదని స్థానికులు చెబుతున్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ చెరువులో ఐలాండ్స్ నిర్మించారు. ఇవి జీవ వైవిధ్యం పెరగడానికి దోహదపడతాయి. భూగర్భ జలాల స్థాయిలు పెరగడంతో చుట్టుపక్కల బోర్లు జీవం పొందాయి. చెరువు చుట్టూ దాదాపు 1.5 కిలోమీటర్ల పాత్‌వే ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేందుకు వందలాది మంది ఇక్కడికి వస్తున్నారు. ఆదివారాలు అయితే చెరువు చుట్టుపక్కల వాతావరణం పిక్నిక్ స్పాట్‌లా మారుతోంది.
స్థానికులు చెబుతున్న మాటల్లో, ఇక్కడ ఇప్పుడు గాలి శుభ్రంగా ఉంది. ఉదయం వాకింగ్ చేయడం చాలా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. మా పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారని అంటున్నారు. చెరువులో పడవ ప్రయాణాలు మొదలవ్వడంతో వాతావరణం మరింత అందంగా మారింది.
Also Read: Viral Couple: ట్రక్‌లోనే ఇల్లు, జీవితం.. ఇలా ఉంటున్నారు ఈ దంపతులు.. సూపర్ కదా!
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, కూకట్‌పల్లి నల్లచెరువు పునరుద్ధరణలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. కొందరు వ్యాపారులు ఆక్రమణలపై నిరసనలు వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 22న చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని 16 షెడ్డులను తొలగించేటప్పుడు సిబ్బంది కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నారు. కానీ చెరువు అభివృద్ధి కోసం మేము వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు ఈ చెరువు అందరికీ ఒక మోడల్‌గా మారిందన్నారు.
ప్రస్తుతం హైడ్రా మొదటి విడతలో 6 చెరువుల అభివృద్ధిని చేపట్టింది. వాటిలో అంబర్‌పేట్ బతుకమ్మ కుంట, కూకట్‌పల్లి నల్లచెరువు దాదాపు సిద్ధమయ్యాయి. మరో కొన్ని రోజుల్లో బమ్రుక్నుద్దౌలా చెరువు, ఉప్పల్ నల్లచెరువు, తమ్మిడికుంట, సున్నం చెరువులు కూడా పూర్తికానున్నాయి. తదుపరి దశలో మరో 13 చెరువుల అభివృద్ధి కూడా ప్రారంభమవుతుంది.
వరదలు లేకుండా, శుభ్రమైన వాతావరణం కలిగిన హరిత నగరాన్ని నిర్మించడం. కమిషనర్ మాటల్లో, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వందేళ్ల క్రితం చూపిన దారినే మేము అనుసరిస్తున్నాం. అప్పట్లో ఆయన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించి వరద సమస్యకు చెక్ పెట్టారు. ఇప్పుడు అదే దారిలో ముందుకు వెళ్తున్నాం. త్వరలోనే హైదరాబాద్ దేశంలోనే ఫ్లడ్ ఫ్రీ సిటీగా గుర్తింపు పొందుతుందన్నారు.
ఇక స్థానికులు చెబుతున్న మాటల్లో ఒకే సంతోషం.. ఒకప్పుడు మురికి కూపంగా ఉన్న చెరువు, ఇప్పుడు అందంగా మారి మన ప్రాంతానికి గర్వకారణమైంది. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక చెరువు అభివృద్ధి మాత్రమే కాదు, ఒక సమాజం జీవన ప్రమాణాలను మార్చే ప్రయత్నం అని చెప్పాలి.