హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారారు. సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే ఫేమస్ అయిన ఆమె ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వంట గ్యాస్ కొరత తన వ్యాపారాన్ని దెబ్బతీస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదని.. అందుకే కట్టెల పొయ్యి మీద వంట చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి ప్రభుత్వం తనకు స్థలం కేటాయించాలని కోరడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం మీద ఎమ్మెల్యేని కలిసి విన్నవిస్తానని ఆమె చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
ట్రోల్స్.. వేరే లెవల్
నెటిజన్లు కుమారి ఆంటీ డిమాండ్లపై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ప్రభుత్వ భూమి అడగడం ఏంటని కొంత మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సరదాగా స్పందిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. కేవలం స్థలం మాత్రమేనా.. వంట చేయడానికి కట్టెలు కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలా..? అని ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఉచితంగా అన్నదానం చేస్తున్నావా..?
వ్యాపారం చేసుకునే వ్యక్తికి ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలం ఎందుకు ఇవ్వాలని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఐటీ ఉద్యోగులకు భోజనం అమ్మే ఆమె.. ఏదో ఉచితంగా అన్నదానం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. కేవలం మాటలతోనే పబ్బం గడుపుకోవాలని చూస్తోందంటూ నెటిజన్లు పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు.
నలుగురు వర్కర్లను కూడా అడగకపోయావా…?
కొంత మంది నెటిజన్లు అయితే ఈ విషయాన్ని మరింత సరదాగా తీసుకున్నారు. స్థలంతో పాటు వంటలో సాయం చేయడానికి నలుగురు వర్కర్లను కూడా అడగాల్సింది అంటూ జోకులు వేస్తున్నారు. ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నట్లు లేదా ఉచితంగా పంచుతున్నట్లు ఆమె ప్రవర్తన ఉందని కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఒక సామాన్య వ్యాపారికి లేని సౌకర్యాలు కుమారి ఆంటీకి ఎందుకు కల్పించాలని చాలామంది సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.
ఎమ్మెల్యేను కూడా కలుస్తావా…?
గతంలో కూడా ఆమె ట్రాఫిక్ సమస్యలు ఇతర కారణాల వల్ల వార్తల్లో నిలిచారు. ఇప్పుడు కట్టెల పొయ్యి కోసం ఏకంగా ఎమ్మెల్యేని కలుస్తానని చెప్పడం ఆమె అతివిశ్వాసానికి నిదర్శనమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కుమారి ఆంటీ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత హాట్ టాపిక్ గా మారాయి.
ALSO READ: LPG Supply: ఏపీలో గ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి దిగిన చంద్రబాబు