Lady Aghori: ఓ వైపు చేతుల్లో పాడె. పాడె పై మృతదేహం. ఖననం చేసే తయారీలో వారందరూ ఉన్నారు. అంతలోనే ఓ కారు సడెన్ గా వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన వ్యక్తి వేషధారణ వెరైటీగా ఉంది. ఆ వ్యక్తి కారు దిగి, ఏకంగా మృతదేహం వద్దకు వచ్చి ఆశ్చర్యపోయే రీతిలో పూజలు చేశారు. అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి అక్కడి వారిది. కొంతసేపు భయం భయంగా ఉన్నారు వారు. కానీ చివరకు వచ్చిన వ్యక్తి వచ్చినట్లుగా తిరిగి వెళ్లారు. ఇంతకు ఆ కారులో వచ్చింది ఎవరో తెలుసా.. అఘోరీ నాగసాధు మాత.
శుభామా అంటూ మనం ఎక్కడికైనా వెళుతున్నామా.. ఎదురుగా వైకుంఠ యాత్ర అంటే మృతదేహాన్ని ఖననం చేసేందుకు వెళుతున్నారా.. వెంటనే న్యూటర్న్ తీసుకుంటాం. లేకుంటే కొందరు భయపడిపోతారు. కానీ అఘోరాలు అలా కాదు. మృతదేహం కనిపిస్తే చాలు వారు చేసే పూజలే వేరు. కొందరు అఘోరాలు మృతదేహం పై కూర్చొని కూడా పూజలు చేస్తారు. గతంలో పలుమార్లు అటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. జీవం లేని శరీరాన్ని దైవంగా భావిస్తారు అఘోరాలు. ఇలాంటి తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలలో వైరల్ గా మారిన అఘోరీ మాత కారులో వెళ్తుండగా, ఓ శవయాత్ర సాగుతోంది. ఇక అక్కడే ఆమె కారు నిలిపి చేసిన పూజలకు అందరూ షాక్ అయ్యారు.
కార్తీక మాసం ప్రారంభమైన సమయం నుండి ఏపీలోని శైవక్షేత్రాలను అఘోరీ మాత దర్శించారు. ఏపీలో తప్పక వస్త్రధారణ కూడా పాటించారు అఘోరీ మాత. అలా తన ఏపీ పర్యటన ముగించుకొని విజయవాడ నుండి తెలంగాణ వైపుకు వస్తున్న అఘోరీ మాతకు దారి మధ్యలో ఓ శవయాత్ర కనిపించింది. అది కూడా స్మశాన వాటిక సమీపంలో. ఇక అంతే కారు దిగిన అఘోరీ మాత, వెంటనే శవం వద్దకు చేరి తన చేతి వ్రేళ్ళతో పూజలు చేసింది. అలాగే పాడె కు అటువైపు, ఇటువైపు తిరిగి దండం పెట్టుకున్నారు. ఈ ప్రక్రియ సాగుతున్నంత సేపు అక్కడి స్థానికులు స్థంభమాశ్చర్యాలకు లోనయ్యారు.
ఏకంగా అఘోరీ మాత వచ్చి పూజలు చేయడం శుభం అంటూ కొందరు అక్కడ చర్చించుకున్నారు. మరికొందరేమో అమ్మో.. భయమేసింది అంటూ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే పూజల అనంతరం అఘోరీ మాత అక్కడి నుండి కారులో పయనమయ్యారు.