BRS Public Meeting: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను బీఆర్ఎస్ నేతలు వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలను ఒక్క చోటికి చేర్చి వేడుకలు నిర్వహించేందుకు అనువుగా ఉండే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధికి చెందిన ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో సభా వేడుకలను నిర్వహించారు.
అయితే, రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ నేతలు రైతులకు చెందిన భూములను చదును చేశారు. ఈ చదును చేసే క్రమంలోనే హద్దులు చెడిపేసి, కాలువలు పూడ్చి.. మట్టి, మోరంతో తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేశారు. సభా ప్రధాన వేదిక, మరి కొన్ని చోట్లు కాంక్రీట్ కూడా వేశారు. అయితే వాహనాలు భారీ మొత్తంలో రావడంతో వ్యవసాయ భూములు గట్టిపడ్డాయి. సభ పూర్తయ్యాక ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. సభ అయితే ముగిసింది.. కానీ రైతుల భూములు మాత్రం వ్యవసాయ యోగ్యంగా మార్చుకోవడం రైతులకు నానా ఇబ్బందిగా మారింది.
రైతులకు ఆర్థిక భారం..
ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామాల రైతులు సహకరించడంతో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సభ ఏర్పాట్లలో భాగంగా 1200 పైగా ఎకరాల్లో భూములను చదును చేశారు. 154 ఎకరాల్లో ప్రధాన సభను, 1059 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లను చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ భూములను సభకు అనుకూలంగా మార్చే క్రమంలో హద్దురాళ్లు, కాలువలను పూడ్చి తాత్కాలిక రోడ్ల నిర్మాణ పనులను చేపట్టడంతోపాటు గట్టితనం కోసం పలు చోట్ల కాంక్రీట్ కూడా వేశారు.
ఇప్పుడు ఆ భూములను సాగులోకి తెచ్చుకునేందుకు సవాల్ గా మారిందని రైతులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం.. పూర్తిగా బాధ్యత తీసుకుని వ్యర్ధాలను తొలగించి.. హద్దులు నిర్ణయించాలని వేడుకుంటున్నారు. అలాగే కాంక్రీట్‌ని తొలగించి కాలువలను ఏర్పాటు చేయాలంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున పనులు చేయకుంటే ఆర్థిక భారం తమపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనే ఇలానే చేశారు..
గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహించి.. భూములు చదును చేసి సరిచేయకుండా వదిలేయడంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. భూ కబ్జాదారులు అందులో చొరబడి సృష్టించిన సమస్యలు పరిష్కారం కాక భూ యజమానులు సంవత్సరాలు గడిచిన సమస్య పరిష్కారం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. 2010 డిసెంబర్ నెలలో వరంగల్ జిల్లా ప్రకాష్ రెడ్డి పేటలో టీఆర్ఎస్ పార్టీ ప్లాట్‌లన్ని చదును చేసి భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ తర్వాత ఎవరి హద్దులు వారికి నిర్ణయించకపోవడంతో కబ్జాదారులు చొరబడి భూ యజమానులను నానా ఇబ్బందులు పెట్టారు.
ఇప్పటికీ ఆ సమస్యల పరిష్కారం కాకపోవడంతో పాటు తమ విలువైన భూములు పోయి అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ అనుభవం నేపథ్యంలో 2022లో హనుమకొండ జిల్లా దేవన్నపేటలో భారీ బహిరంగ సభ నిర్వహణ కోసం భూమి సేకరించేందుకు ప్రయత్నించిన రైతులు ఇవ్వడానికి నిరాకరించారు. బీఆర్ఎస్ ఎక్కడ సభ నిర్వహించిన ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మళ్లీ అలాంటి పరిస్థితి ఎలుకతుర్తిలో పునరావృతం కాకుండా చూడాలని రైతుల కోరుతున్నారు.
మా భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చాలి..
రజతోత్సవ సభ నిర్వహణ కోసం ముందుకు వస్తే వారికి ఎల్కతుర్తి రైతులు బీఆర్ఎస్ నేతలకు పూర్తి సహకారం అందించారు. రైతుల సహకారంతో సభ సజావుగా సాగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు తాము అన్ని విధాల భూములు ఇచ్చి సహకరించామని.. తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చి ఇవ్వాలని రైతులు గులాబీ నేతలను వేడుకుంటున్నారు.
సమస్యను పరిష్కరిస్తాం: మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్
రైతులు అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థన మేరకు తమ భూములను సభ నిర్వహణకు ఇచ్చి అన్ని విధాల సహకరించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ అన్నారు. సభ నిర్వహణ కోసం రైతులకు భూములను వాడుకున్నామని చెప్పారు. తాత్కాలిక రోడ్ల నిర్మాణం, అవసరమైన చోట మొరం, మట్టి, కాంక్రీట్ వేయాల్సి వచ్చిందని అన్నారు. అన్ని విధాల శుభ్రం చేసి రైతులకు ఇబ్బంది కలుగకుండా పూర్తి బాధ్యత తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.