Indian Railways: రైళ్లలో భద్రత పెంచేందు కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే గవర్నమెంట్ పోలీస్(GRP) సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ‘ఆపరేషన్ ప్యాసింజర్ సెక్యూరిటీ’ లో భాగంగా ఆయా రైళ్లలను ఆకస్మికంగా చెకింగ్స్ చేస్తున్నాయి. తాజా తనిఖీల్లో ముగ్గురు దొంగలు చిక్కారు. వారి నుంచి పలు సెల్ ఫోన్లతో పాటు, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
ఏసీ కోచ్ లో చెమటలు.. దొంగలు దొరికారిలా!
తాజాగా ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బృందం సంయుక్తంగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో ‘ఆపరేషన్ ప్యాసింజర్ సెక్యూరిటీ’ నిర్వహించారు. గత కొద్ది కాలంగా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న రైల్వే స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్ లో ఆపరేషన్ కొనసాగించారు. ఈ సందర్భంగా ముగ్గురు కరడు గట్టిన నేరస్థులను పట్టుకున్నారు.
ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్ లో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు రైలులోని ఎయిర్ కండిషన్డ్ కోచ్ నుంచి దిగి ప్లాట్ ఫామ్ నంబర్ 1 చివరిలో కూర్చోవడం పోలీసులు గమనించారు. ఈ ముగ్గురికీ విపరీతంగా చెమటలు పట్టాయి. పోలీసులు ఏదో జరిగిందని అనుమానించారు. వెంటనే వారి దగ్గరికి వెళ్లారు. ఏసీ కోచ్ నుంచి దిగిన మీకు చెమటలు ఎందుకు పట్టాయని ప్రశ్నించారు. కోచ్ లో ఏసీ సరిగా పని చేయడం లేదని చెప్పారు. లోపలికి వెళ్లి చూస్తే ఏసీ సరిగానే పని చేస్తుంది. పోలీసులకు అనుమానం కలిగి తమదైన శైలిలో విచారించడంతో అసలు కథ బయటపడింది.
Read Also: రైళ్లలో మోబైల్స్, ల్యాప్ టాప్స్ ఛార్జింగ్ చేస్తున్నారా? అయితే, మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
రూ. 1.5 లక్షలు విలువ చేసే ఫోన్లు, బంగారం స్వాధీనం
ఆ ముగ్గురు వ్యక్తులు రైళ్లలో దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలను ఆరా తీశారు. ఒక్కో వ్యక్తి రెండు సెల్ ఫోన్లను కొట్టేసినట్లు గుర్తించారు. ఈ నిందితులను రోహ్ తక్ కు చెందిన సంజయ్ కుమార్, హిసార్ కు చెందిన వినోద్ కుమార్, ఉత్తరప్రదేశ్ లోని బందాకు చెందిన దిలీప్ సాహుగా గుర్తించారు. ఈ ముగ్గురూ రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు. GRP పోలీసులు వీరిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసినట్లు వెల్లడైంది. వీరి నుంచి మొత్తం ఆరు మోబైల్ ఫోన్లు, ఒక బంగారు ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 1.5 లక్షలు ఉంటుందని గుర్తించారు.
Read Also: వందే భారత్, శతాబ్ది రైళ్లు ప్రభుత్వం నడపడం లేదా? ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయా?