Liquor Sales in Telugu States: అసలే కొత్త ఏడాది వస్తోంది. అందులోనూ డిసెంబర్ 31 రానే వచ్చింది. ఇంకేముంది ఆ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే సరుకు చేరాల్సిన చోటుకి చేరాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకేనేమో ఏ షాపు వద్ద చూసినా క్యూ కనిపిస్తోంది. ఇంత చెప్పాక షాపుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా అదేనండీ వైన్స్ షాపులు. కొత్త ఏడాదికి ఓ వైపు ఏర్పాట్లు, మరోవైపు సంబరాలకు సన్నాహాలు సాగుతున్నాయి.
న్యూ ఇయర్ వచ్చిందటే చాలు.. గ్లాసుల గలగల ఉండాల్సిందే. మద్యం ప్రియుల జోష్ మామూలుగా ఉండదు. అందుకే నిన్నటి నుండి మద్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఏ వైన్స్ షాప్ చూసినా నిండు కళను సంతరించుకుంది. డిసెంబర్ 31 రాత్రి చేసే హంగామా కాసింత చుక్క పడాల్సిందే అంటున్నారు మద్యం ప్రియులు. వైన్స్ షాపుల వద్దకే కాకుండా, రిటైల్ కొనుగోళ్లు కూడా జోరుగా సాగుతున్నాయి.
ఈ రాత్రికి మద్యం కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో మద్యం కొనుగోళ్లు ఊపందుకోగా, వ్యాపారస్తులలో కూడా జోష్ పెరిగిందట. ఎక్సైజ్ శాఖ కూడా ముందుగానే, మద్యం స్టాక్ ను కూడా షాపులకు తరలించడంతో మద్యానికి కొరత లేదని చెప్పవచ్చు. తెలంగాణలో బెవరేజ్ శాఖ నుంచి భారీగా కొనుగోళ్లు సాగుతుండగా, నిన్న ఒక్కరోజే రిటైల్ గా షాపు యజమానులు కొనుగోళ్లు చేశారు. నిన్న ఒక్కరోజే మద్యం కొనుగోళ్లతో రూ. 402 కోట్ల 62 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారుల అంచనా. అందులో 3లక్షల 82 వేల 265 కేసుల లిక్కర్, 3లక్షల 96 వేల 114 కేసుల బీర్ల కొనుగోళ్లు సాగాయట.
Also Read: CM Chandrababu: పరదాలు లేవులే జగన్.. కాఫీ పెడితే తప్పేంటి.. సీఎం చంద్రబాబు
డిసెంబర్ 1 నుండి 30 వరకు అబ్కారీ శాఖకు భారీగా 3523కోట్ల 16 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు. ఇక ఏపీలో అయితే సరుకు రావడం ఖాళీ కావడం ఇదేతంతు సాగుతుందట. అసలే బ్రాండ్ మద్యం సీసాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాగా, మద్యం ప్రియుల జోష్ అంతా ఇంతా కాదట. రూ. 99 లకే క్వార్టర్ బాటిల్స్ విక్రయాలను తలదన్నేలా, బీర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయట. డిసెంబర్ 31 రాత్రికి కోట్లల్లో మద్యం వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్తులు తెలుపుతున్నారు.