Liquor shops: తెలంగాణలో మద్యం ప్రియులకు ఊహించని బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ సిటీ శివార్లలో మూడు రోజులపాటు మద్యం షాపులు క్లోజ్ కానున్నాయి. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మద్యం షాపులు మూసి వేయబడతాయి.
ఫిబ్రవరి 25 ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 27 ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాలైన కొల్లూరు, ఆర్‌సీ పురం పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్లు దుకాణాలు, వైన్ షాపులు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు, స్టార్ హోటళ్లలోని బార్‌లు, క్లబ్బులు మూసి వేయనున్నారు.
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఓటర్లను మభ్యపెట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
ఫిబ్రవరి 27న వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచర్ స్థానం, మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్ సీటు, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ALSO READ: హైదరాబాద్ మెట్రో కారిడార్-4, ఆ ప్రాంతాల మీదుగా
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి రెండురోజుల కిందట వివిధ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష చేశారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు, మైక్రో అబ్జర్వర్‌ల నియామకం, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ బాక్సుల గురించి సీఈవోకు వివరించారు ఆయా జిల్లాల కలెక్టర్లు.