TPCC Chief Mahesh Kumar Goud Comments: మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. సోమవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ఆ విధంగా పోస్టులు పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బీఆర్ఎస్ సోషల్ మీడియా దిగజారి వ్యవహరిస్తుంది. మహిళా మంత్రులపై అంత దారుణంగా ట్రోలింగ్ చేస్తుంటే కేటీఆర్, హరీష్ రావు హెచ్చరించరా? ఆ పోస్టులను చూసి రాష్ట్రంలో ఉన్న పద్మశాలి గుండెలు బాధపడుతున్నాయి. ఉద్యమాలు చేసి మంత్రిగా ఎదిగిన ఒక పద్మశాలి బిడ్డను ఇంతలా అవమానుపరుస్తారా..? ఈ విధంగా పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్.. ఎస్సీ, ఎస్టీ, బీసీలం కన్నెర్ర చేస్తే ఉంటుందా? కేటీఆర్ స్థానంలో నేను ఉంటే వెంటనే క్షమాపణ చెప్పేవాడిని. రాజకీయంగా విమర్శ చేయాలి.. తప్పులేదు కానీ, ఒక బీసీ ఆడ బిడ్డను ఈ విధంగా అవమానపరుస్తారా? అది ఎంతవరకు కరెక్టు?
కవిత లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయితే కాంగ్రెస్ నాయకులం ఆ కేసు గురించి మాత్రమే మాట్లాడాం తప్ప మరేం మాట్లాడలేదు. మహిళా నాయకులపై బీఆర్ఎస్ చేస్తున్న ట్రోలింగ్ పై కేటీఆర్, హరీష్ వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది బీఆర్ఎస్ నాయకులు మహిళలకు ఇస్తున్న గౌరవం ఎలాంటిదో అనేది. అయినా తమ పాలనలో మహిళకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్ఎస్.. మహిళలకు గౌరవం ఏం ఇస్తారులే’ అంటూ పీసీసీ చీఫ్ విమర్శించారు.
Also Read: కూతురి పెళ్లికి బంగారు చీర.. సిరిసిల్ల చేనేత అద్భుతం
అనంతరం మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయమై ఆయన మాట్లాడారు. ‘మల్లన్న సాగర్ నిర్వాసితులను బీఆర్ఎస్ పాలనలో సీఆర్పీఎఫ్ జవాన్లతో నిర్బంధించారు. సిరిసిల్ల వీరుడు, ధీరుడు కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. పదేండ్లలో జరిపిన నియంత పాలనను మర్చిపోయారా కేటీఆర్? అయ్యా, కొడుకు, బిడ్డ, అల్లుడు దోచుకున్న దోపిడీ కారణంగా పార్లమెంటు ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చాయి. సోషల్ మీడియాను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సోషల్ సైన్స్ లేకుండా ఇష్టానుసారంగా వాడుతున్నాయి. మూసీ బెడ్ లో ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గుడిసెను కూడా తీయలేదు.
నీటితో మానవుడికి విడదీయరానటువంటి బంధం ఉంటుంది. 3500 చెరువులతో కళకళలాడిన హైదరాబాద్ ప్రస్తుతం ఎలా ఉంది? కాంగ్రెస్ హయంలో కూడా చెరువులు కబ్జాకు గురై ఉండొచ్చు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వనరుల విధ్వంసం చాలా జరిగింది. గతంలో మూసీ వరదలు వచ్చినప్పుడు వేలాది మంది ప్రజలు చనిపోయారు. వాయినాడ్ వరదలను మేం కళ్ళారా చూశాం. హైదారాబాద్ లో భారీగా వర్షాలు వస్తే పరిస్థితి ఏమిటి? బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. ఆ జలప్రళయంలో హైదరాబాద్ కొట్టుకుపోవాలని మీరు భావిస్తున్నారా?
మూసీ ప్రక్షాళన చేయాలని గతంలో కేసీఆర్ అనలేదా? మూసీ ప్రక్షాళన చేస్తామంటూ మీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా. కనీసం పిల్లలకు ఉన్న జ్ఞానం బీఆర్ఎస్ నాయకులకు లేదు. గుట్టలన్నీ మాయం చేసి రియల్ ఎస్టేట్ చేసింది మీరు కాదా? మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాంట్లో భాగస్వాములు.
Also Read: దసరాకు 6 వేల స్పెషల్ బస్సులు.. ముందస్తు రిజర్వేషన్ కోసం సైట్ ఓపెన్..
హైడ్రా టార్గెట్ భూ బకాసురులు మాత్రమే.. పేద ప్రజలు కాదు. పేదలు నష్టపోతే వారికి నష్టపరిహారం అందజేస్తాం. మూసీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు ఒక్క గుడిసెను కూడా తొలగించలేదు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. లేకపోతే రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కూడా ప్రమాదం ఉంటుంది.
సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో విష ప్రచారం చేయిస్తున్నారు. తప్పుడు వార్తలతో విష ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ కు రూ. కోట్లాది పెట్టుబడులు వస్తాయి. తమ హయాంలో హదరాబాద్ ఎంతో అభివృద్ధి జరిగిందంటూ తిమ్మిని బమ్మి చేసి సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే కేవలం జన్వాడ ఫాం హౌస్ చుట్టూ ఉన్న అభివృద్దేనా? లేదా హరీష్, కవిత ఫాం హౌజ్ చుట్టూ జరిగిన అభివృద్దా? పాత బస్తీని కేసీఆర్ అస్సలే పట్టించుకోలేదు’ అంటూ ఆయన బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.