Kavitha: తెలంగాణ రాజకీయాలు మరోసారి తీవ్రస్థాయి ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కాయి. 22A వర్గీకరణను వేదికగా చేసుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో 22A పరిధిలోకి వచ్చే సుమారు వంద ఎకరాల నిషేధిత భూమిని మాజీ మంత్రి హరీశ్‌రావు తన తండ్రి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణ రేవంత్ రెడ్డి సర్కారుకు, బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలకు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో ‘22A’ అక్రమాలు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 22A పేరుతో అనేక అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించిన కవిత, గత బీఆర్ఎస్ పాలనలో కూడా అంతకంటే పెద్ద ఎత్తునే భూ దందాలు జరిగాయని కుండబద్దలు కొట్టారు. సిద్దిపేట భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఆమె, ధైర్యముంటే ఆధారాలను పరిశీలించి హరీశ్‌రావుపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపు
గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య నడిచే ఆరోపణల పర్వం, ఇప్పుడు సొంత పార్టీ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. నిషేధిత భూముల కేటాయింపులు, రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఉన్న నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. కవిత పంపే ఆధారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? విచారణకు ఆదేశిస్తుందా లేదా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read: అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!