Mallikarjuna Kharge: తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు కార్యకర్తల కృషి ఫలితమే అని చెప్పారు. సీఎం రేవంత్, భట్టి, మంత్రులు కాంగ్రెస్ గెలుపు కోసం చాలా కృషి చేశారని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఊహించలేదని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సామాజిక న్యాయ సమరభేరి సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పని చేస్తోందని మల్లికార్జున ఖర్గే కొనియాడారు. రైతు రుణమాఫీ, మహిళలకు ఫ్రీ బస్, సన్న బియ్యం వంటి అనేక పథకాలు హామీలు విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. దేశంలో రేషన్ ద్వారా సన్న బియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కులగణన చేశామని.. రాహుల్ చెప్పిన మాటకు ఇదే నిదర్శమని పేర్కొన్నారు.
‘కేసీఆర్, బీజేపీ కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ను అడ్డుకుంటారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను ఓడించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని గతంలో చెప్పాను. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలో 50కి పైగా కేంద్ర సంస్థలు వచ్చాయి. ప్రధాని మోదీ తెలంగాణకు 11 ఏళ్లలో ఏం ఇచ్చారు? మోదీ ప్రజలకు చెప్పేవన్నీ అబద్ధాలే’ అని వ్యాఖ్యానించారు.
‘రేవంత్ సర్కార్ రైతు భరోసా కింద రూ.8200 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసింది. కాంగ్రెస్ ఏం చెప్పిందో అవన్నీ చేసి చూపించింది. దేశంలో తొలిసారి కులగణన చేపట్టింది తెలంగాణలోనే.. మోదీ, అమిత్ షా చాలా చాలా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్లు ఈ దేశానికి, తెలంగాణకు చేసిందేమిటి? నెహ్రు, ఇందిరా హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. తెలంగాణలోని గత ప్రభుత్వం అత్యంత అవినీతికి పాల్పడింది’ అని వివరించారు.
ALSO READ: Public Holiday: మొహర్రం ప్రభుత్వ సెలవు దినం ఎప్పుడు? రెండు రోజులు హాలిడే ఉంటుందా?
ఇందిరాగాంధీ పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేసింది.. మరీ మోదీ ఏం చేశారు? అమెరికా యుద్ధ నౌకలను పంపినా ఇందిరాగాంధీ భయపడకుండా దైర్యంగా యుద్ధాన్ని కొనసాగించారు. పహాల్గామ్ ఉగ్రదాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమర్థించింది. పహాల్గామ్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ నేతలు అని దేశాలు తిరిగి ప్రచారం చేశారు. గాంధీ కుటుంబంలో దేశం కోసం ప్రాణాలను ఇచ్చిన వాళ్లు ఉన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో అలాంటి వాళ్లు ఉన్నారా..? దేశం కోసం ప్రాణాలను ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తాం.. దేశాన్ని కాపాడతాం. బీహార్ ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ, మోదీకి దేశ భద్రతపై లేదు. 42 దేశాల్లో పర్యటించిన మోదీ.. మణిపూర్ కు ఎందుకు వెళ్లడం లేదు’ అని ఆయన నిలదీశారు.