MP gender change case: ఒక స్నేహితుడిపై మనసు పడిన వ్యక్తి.. ఆ మనసు ప్రేమగా మారకపోతే ఓ క్రూరత్వంగా మారిందా? నమ్మకాన్ని ఆయుధంగా మార్చి, జీవితాన్ని మారుస్తూ ఆ యువకుడిని బలిచేశాడా? మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇటీవల నమోదైన ఓ కేసు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. 27 ఏళ్ల ఒక యువకుడిని అతని స్నేహితుడు శుభమ్ పేరుతో ఉన్న వ్యక్తి మాయ మాయ మాటలతో లొంగదీసుకొని, అతి భయానకంగా మోసం చేసిన ఘటన ఇది. భోపాల్‌కి చెందిన బాధితుడు, శుభమ్ అనే యువకుడితో స్నేహం పెంచుకున్నాడు. మొదట ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటూ, తర్వాత ఒకే అపార్ట్‌మెంట్‌లో సహజీవనం చేయడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత కొన్ని నెలల వ్యవధిలో శుభమ్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని బాధితుడు పోలీసులకు తెలిపాడు. శుభమ్ తరచూ అతనిపై లైంగిక ఆసక్తి చూపుతూ, బలవంతంగా కొన్ని మందులు ఇచ్చేవాడట. ఈ మందులు తలనొప్పులకు ఇవ్వబడుతున్నట్లు చెప్పినా, అవి హార్మోన్ ట్రీట్‌మెంట్ కోసం అని తర్వాత తెలుస్తుంది. ఓ నెల వ్యవధిలోనే బాధితుడి శరీరంలో చాలా మార్పులు కనిపించసాగాయి. దీని గురించి ఆలోచించేలోపే శుభమ్ అతనిని ఇండోర్‌కి తీసుకెళ్లి, బలవంతంగా లింగ మార్పు శస్త్రచికిత్స చేయించాడు.
ఈ లింగమార్పు శస్త్రచికిత్సకు మొత్తం రూ.5 లక్షలు ఖర్చయిందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. శస్త్రచికిత్స తర్వాత, శుభమ్ అతనిని తన ఇంటికి రమ్మని పిలిచి, మళ్ళీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడట. అంతటితో స్టోరీ ముగియలేదు. శుభమ్ బాధితుడిని బెదిరిస్తూ, అతని జీవితాన్ని నాశనం చేస్తానని, తన చెప్పినట్టు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. లేదంటే ఈ విషయం బయటపెడతానంటూ మానసికంగా హింసించాడు.
Also Read: One Kidney Village Story: ఆ ఊరిలో అందరికీ ఒక కిడ్నీనే.. దీని వెనుక భారీ మోసం.. అదేమిటంటే?
ఈ ఘటనపై బాధితుడు భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన ప్రాంతం నర్మదాపురం జిల్లాలోకి వస్తుంది. అందువల్ల కేసును ఆ జిల్లా పోలీసులకు బదిలీ చేయనున్నారు. పోలీసులు ప్రస్తుతం బాధితుని నుంచి పూర్తి స్థాయిలో మెడికల్ నివేదికలు, ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన డాక్యుమెంట్లు సేకరిస్తున్నారు. ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు కానీ, పూర్తి ఆధారాలతో చర్య తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు.
ఇంతకీ.. ఒక వ్యక్తి మీద ప్రేమ పుడితే, అతడు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడా? శరీరాన్ని మారుస్తాడా? ఇలాంటి సంఘటనలు సామాజిక స్థాయిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. బలవంతపు లింగమార్పులకు సంబంధించి దేశంలోని చట్టాలు చాలా క్లియర్‌గా ఉన్నా, అవి అపరాధాలకు అడ్డుకావడం లేదనేది ఈ సంఘటన వెలుగులోకి వచ్చినపుడు స్పష్టమవుతోంది.
బాధితుడు మాత్రం తన జీవితాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాడు. శరీరానికి మిగిలిపోయిన శస్త్రచికిత్స పీడలు, మానసికంగా ఎదుర్కొన్న దుఃఖం.. ఇవన్నీ కలిపి ఒక మనిషి జీవితం ఏ స్థాయిలో తారుమారవుతుందో ఈ సంఘటన ఒక మేటి ఉదాహరణగా నిలుస్తోంది.