Mancherial district: తెలంగాణ రైతు సంప్రదాయానికి మరో అద్భుత రూపం ఇచ్చారు మంచిర్యాల జిల్లా జోగాపూర్ గ్రామానికి చెందిన రైతు దంపతులు. నెన్నెల మండలానికి చెందిన నీకాడి మదునయ్య, శ్యామల దంపతులు తమ మామిడి తోట కోతకు సిద్ధమవుతుండగా, మామిడి చెట్లతో తమకున్న అనుబంధాన్ని వ్యక్తపరచేందుకు ప్రత్యేకంగా వివాహ వేడుక నిర్వహించారు.
పూర్తి వివరాలలోకి వెళితే..
ఇంతకీ చెట్లకు పెళ్లి ఎందుకు చేసారు? ఎందుకంటే రైతు మదునయ్యకు వాటిపై మామూలుగా కాకుండా ఓ ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఇది మామూలు తోట కాదు, తాను అమిత ఇష్టంగా సాగు చేసిన మామిడి తోట. ఇది తనకు సంపాదనకు మార్గమే కాదు, కుటుంబానికి ఉమ్మడి జీవనాధారంగా మారింది.
ప్రతి చెట్టును ఒక బంధువు లా భావించే మదునయ్య, కోతకు ముందు చెట్లకు వివాహం జరిపి ఒక సంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఇంటి పెళ్లిలా వేద మంత్రాల మధ్య, బంధువులు, స్థానికుల సమక్షంలో చెట్లకు మనువులు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి అనంతరం అతిథులకు భోజన ఏర్పాట్లు చేసి సంప్రదాయ పద్దతిలో ఆచారం నిర్వహించడం విశేషం.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో, పూలతో అలంకరించిన చెట్ల మధ్య పెళ్లి సంబరాలు జరిగాయి. తలంబ్రాలు, తాళి, హారతి అన్నీ ఇంటి పెళ్లిలా సాగాయి. చెట్లకు సింధూరం పెట్టి, పూలతో అలంకరించి, చెట్లను వధువు వరుల్లా భావించి పెళ్లి జరిపారు. అనంతరం బంధువులకు, స్థానికులకు అన్నదానం చేశారు.
రైతు మదునయ్య ఈ విధంగా చెట్లకు పెళ్లి జరిపిన అంశం కేవలం ఓ ఆచారం కాదు. ఇది ఒక సందేశం కూడా. ప్రకృతి పట్ల మనం ఎలా ఆరాధన చేసుకోవాలో, వ్యవసాయాన్ని ఎంత గౌరవంతో చూడాలో చెప్పే సందేశం. కాలానుగుణంగా చెట్లను కేవలం ఆదాయ వనరులుగా చూస్తున్న తరుణంలో, మదునయ్య చూపించిన విధానం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని కొందరు రైతులు అంటున్నారు.
ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ స్థానిక వ్యవసాయ అధికారులు కూడా స్పందించారు. ఇది ప్రకృతి పట్ల ప్రేమను, జవాబుదారీతనాన్ని చూపించడమేనని అభిప్రాయపడ్డారు. రైతు మదునయ్య మాట్లాడుతూ.. మా మామిడి చెట్లే మా కుటుంబ సభ్యుల్లా. ఇవి మనకు ఆర్థికంగా లాభం ఇస్తే కాదు, మనసుకు ఆనందం కూడా ఇస్తాయి. కాబట్టి వీటితో మా బంధం వ్యక్తం చేసేందుకే ఈ పెళ్లి చేశామని తెలిపారు.
Also Read: AP Monalisa: మళ్లీ మొదలైంది మోనాలిసా మాయ.. ఈసారి ఏపీలో!
ఇలాంటి సంఘటనలు గ్రామీణ తెలంగాణ సంస్కృతిలో విశేషమని చెప్పవచ్చు. కానీ ఈ స్థాయిలో చెట్లకు వివాహ వేడుక జరిపిన ఘటన మాత్రం అరుదైనదే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. చాలామంది ఈ రైతు నిర్ణయాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.