Mancherial District tragedy: అభంశుభం తెలియని చిన్నారుల పట్ల పర్యవేక్షణ అత్యంత అవసరం. మనం కాస్త ఏమరుపాటుగా ఉన్నా, జరిగే నష్టాన్ని పూరించలేము. అలాంటి ఘటనే ఇది. ఓ 9 నెలల బాలుడు ఏకంగా కూల్ డ్రింక్ మూత మింగి దురదృష్టవశాత్తు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
అదొక శుభకార్యం జరిగే ఇల్లు. ఎటువైపు చూసినా ఆ ఇల్లు సందడిగా ఉంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అలాగే తమ పిల్లలను వెంటబెట్టుకొని వచ్చిన తల్లిదండ్రులు అందరితో మాటామంతీ కలుపుతున్నారు. అదే సమయంలో ఓ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులు అసలేం జరిగిందనే ఆలోచనలో పడ్డారు. చిన్నారి ఆడుకుంటూ ఉండేవాడు. అంతలోనే ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. కానీ అంతలోనే జరగరాని నష్టం జరిగిపోయింది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మున్సిపాలిటీలోని ఉత్కూర్‌లో నివసిస్తున్న సురేందర్ కు రుద్ర అయాన్ 9 నెలల బాబు సంతానం. సురేందర్ తన కుటుంబంతో కలిసి లక్షెట్టిపేట్ మండలంలో కొమ్ముగూడెంలోని ఓ శుభకార్యానికి హాజరయ్యారు. ఇక్కడ ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. అయితే రుద్ర అయాన్ కొద్దిసేపు ఆటలాడుకొనేందుకు వదిలారు. ఓ వైపు అయాన్ వైపు కన్ను వేసిన సురేందర్ గమనిస్తూనే ఉన్నారు. అయితే ఆ సమయంలో ఎలా దొరికిందో, అయాన్ చేతికి కూల్ డ్రింక్ మూత దొరికింది. మంచేదో, చెడు ఏమిటో అర్థం కాని వయస్సు అది. 9 నెలల బాలుడికి ఏం తెలుస్తుంది పాపం.. ఆ మూతను ఏకంగా నోటిలోకి తీసుకున్నాడు. తక్కువ సమయంలోనే మింగేశాడు. ఇంకేముంది.. అయాన్ కు ఊపిరాడని పరిస్థితి.
దీనితో అయాన్ రోదించడం మొదలు పెట్టాడు. వెంటనే గమనించిన అతని తల్లిదండ్రులు తమ కోసం బిడ్డ ఏడుస్తున్నాడని భావించారు. అయాన్ ను ఎత్తుకొని ఓదార్చే ప్రయత్నం చేయగా, ఇంకా అయాన్ బిగ్గరగా ఏడుస్తుండగా నోటిలో కూల్ డ్రింక్ మూత ఇరుక్కుపోయినట్లు గమనించారు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు అసలు విషయం చెప్పారు. అయితే అప్పటికే అయాన్ కు శ్వాస ఆడక కన్నుమూశాడు. 9 నెలల బిడ్డ తమ కళ్ల ముందే మృత్యు ఒడిలోకి జారిపోవడంతో, ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం.
Also Read: Mancherial District: ఒక్క ఇంజక్షన్ రూ. 16 కోట్లా? ఈ పిల్లలను ఆదుకొనే వారెవరు?
అయాన్ మృతి చెందినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. అలాగే శుభకార్యానికి వచ్చిన వారు అయాన్ మృతి చెందినట్లు సమాచారం తెలుసుకొని రోదించారు. చిన్నారులను వెంటబెట్టుకొని ఎక్కడికైనా వెళ్లిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు. అలాగే తల్లిదండ్రుల పర్యవేక్షణలో చిన్నారులు ఉండేలా ప్రత్యేక శ్రద్ద వహించాలని, క్షణంలోనే చిన్నారులు తెలిసీ తెలియక చేసే పనులు పెను ప్రమాదాన్ని తెచ్చి పెడతాయని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద అయాన్ మృతి చెందినట్లు సమాచారం తెలుసుకున్న చుట్టు ప్రక్కల గ్రామస్థులు అయాన్ మృతదేహాన్ని సందర్శించి, అతని తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను ఓదార్చారు.