Hyderabad ORR Manmohan Singh| దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దేశాభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డ (ఓఆర్ఆర్) తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించారు. హైదరాబాద్ నగరానికి అర్బన్ కనెక్టివిటీ, అభివృద్ధికి ముఖ్యకారణమైన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు వెనుక మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కృషి ఎంతో ఉంది. ఈ భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుతో హైదరాబాద్ నగర రూపురేఖలే మారిపోయాయి. ఓఆర్ఆర్ కంటే ముందు నగర విస్తరణ ఒక కలగానే ఉండేది. కానీ ఈ ప్రాజెక్టుకు జపాన్ నుంచి నిధులు తీసుకురావడంలో స్వయంగా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు.
జపాన్ ఇంటర్నేషన్నల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జెఐసిఏ) నిధులు ఇవ్వడంతో హైదరాబాద్ ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు జనవరి 3, 2006న నగర పరిసరాల్లో శంషాబాద్ సమీపంలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు 158 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ భారీ లింకింగ్ ప్రాజెక్టు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన హైటెక్ సిటీ, నానక్ రామ్ గూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, ఐకెపి నాలెడ్జ్ పార్క్ లను అనుసంధానం చేస్తుంది.
ఆర్బిటల్ షేపులో ఉన్నఓఆర్ఆర్ ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత నుంచి హైదరాబాద్ నగరంలోని ఆయా ప్రాంతాలలో ప్రజలకు ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి లభించింది. తద్వారా సమీప పట్టణ ప్రాంతాలు హైదరాబాద్ లో భాగమవుతూ వచ్చాయి.
Also Read: మంచి మిత్రుడు, దార్శనికుడు, దేశానికెంతో చేశారు.. మన్మోహన్ సింగ్‌ని స్మరించుకున్న సోనియా గాంధీ
ఈ ప్రాజెక్టు కోసం జపాన్ కంపెనీ జెఐసిఏ 80 బిలియన్ యెన్లు (జపాన్ కరెన్సీ) .. దాదాపు రూ. 3123 కోట్ల లోన్ ఇచ్చింది. ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 6796 కోట్లు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెఎండిఏ) కు చెందిన ఒక రిటైర్డ్ అధికారి కథనం ప్రకారం.. ఆ రోజుల్లో విదేశాల నుంచి నిధులు తీసురావడం చాలా కష్టం. కానీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకొని జపాన్ కంపెనీ నుంచి లోన్ సమకూర్చడానికి కేంద్రం నుంచి హామీ ఇప్పించారు. ఆయన 2008లో జపాన్ రాజధాని టోక్యో పర్యటనకు వెళ్లినప్పుడు జపాన్ లోని జెఐసిఏ కంపెనీతో ఓఆర్ఆర్ నిర్మాణం కోసం ఒప్పందం చేశారు. మన్మోహన్ సింగ్ గారు ఆ సమయంలో ప్రధాన మంత్రి పదవిలో ఉండడం వల్లనే హైదరాబాద్ ఓఆర్ఆర్ ఈ రోజు పూర్తయింది. దాని ఫలాలు హైదరాబాద్ వాసులకు అందాయి.
హైదరాబాద్ ఓఆర్ఆర్ ప్రాజెక్టుని రోడ్ కం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గా డిజైన్ చేశారు. ఓఆర్ఆర్ పూర్తి కావడంతో రెసిడెన్షియల్, కమర్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నగరంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఆధునిక ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, సినిమా ఎంటర్‌టైన్మెంట్ కేంద్రాలు రూపు దాల్చాయి. చుట్టు పక్కల గ్రామాలు సైతం ఓఆర్ఆర్ వల్ల ఎంతో అభివృద్ధి చెందాయి.
డాక్టర్ మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26 గురువారం రాత్రి మృతి చెందారు. ఆయన మరణంతో దేశ రాజకీయాల్లో ఓ శూన్యత ఏర్పడింది.