Sonia Gandhi Manmohan Singh| కాంగ్రెస్ అధినాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతిపై సంతాపం ప్రకటించారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ గురువారం డిసెంబర్ 26న మృతి చెందారు. మాజీ మరణం తరువాత సోనియా గాంధీ ఆయనను స్మరించుకుంటూ శుక్రవారం రాత్రి ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో మన్మోహన్ సింగ్ ను చాతుర్యానికి శిఖరంగా, రాజసమున్నా వినయానికి ప్రతీకగా అభివర్ణించారు. మన్మోహన్ మరణం తనకు వ్యక్తిగతంగానూ చాలా పెద్ద నష్టమని సోనియా గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.
“ఆయన (మన్మోహన్ సింగ్) ఒక తత్వవేత్త, నాకు మిత్రడు, మార్గనిర్దేశకుడు. స్వభావంలో ఎంతో మృదువుగా ఉండే ఆయన సంకల్పస్తే మాత్రం కఠినంగా ఉంటారు. సామాజిక న్యాయం, సెకులరిజం, ప్రజాస్వామ్య విలువలు పట్ల ఆయన ఎంతో నిబద్ధతతో ఉండేవారు. ఆయనతో సమయం గడిపితే జ్ఞానం, చతురత అంటే నిజంగా ఏమిటో తెలిసి వస్తుంది. ఆయనలోని నిజాయితీ, సమగ్రత, వినయం పట్ల ఎవరైనా అకర్షితులవుతారు. మన్మోహన్ వెళ్లిపోయాక మన జాతీయ జీవితంలో ఒక శూన్యం ఏర్పడినట్లు ఉంది. కాంగ్రెస్ పార్టీ, భారతదేశ ప్రజలు.. డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడు లభించినందుకు ఎంతో గర్వపడాలి. ఆయన చేసిన దేశ సేవకు అందరం ధన్యవాదాలు తెలపాలి.” అని సోనియా గాంధీ ఎంతో భావోద్వేగంగా లేఖ రాశారు.
సోనియా గాంధీ రాసిన లేఖలో ఆమె సంతానమైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాడ్రా కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. తాను ఒక గురువు, ఒక దార్శనికుడిని కోల్పోయానని, గాంధీ కుటుంబంలో డాక్టర్ మన్మోహన్ కు ప్రత్యేక స్థానం ఉందని రాహుల్ గాంధీ రాశారు.
Also Read: మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మోడీ, షా.. అంతక్రియలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి
ప్రియాంక గాంధీ కూడా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను ప్రశంసించారు. “మన్మోహన్ సింగ్ గారికి దక్కిన గౌరవం చాలా అరుదైన రాజకీయ నాయకులకు మాత్రమే లభిస్తుంది. ఆయన రాజకీయాలు అందరికీ ఆదర్శం.. దేశాన్ని ప్రేమించే వారి దృష్టిలో మన్మోహన్ సింగ్ నిజాయితీ ఒక శిఖరం.” అని ప్రియాకం రాశారు.
2004 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుపిఎ కూటమి విజయం సాధించిన తరువాత ప్రధాన మంత్రి పదవి చేప్పట్టే అవకాశాలున్నా.. సోనియా గాంధీ ఆ పదిని త్యజించాల్సి వచ్చింది. ఈ ప్రస్తావన కూడా సోనియా గాంధీ తన లేఖలో రాశారు.
“నాకు ఉన్న పరిమితి, హద్దుల గురించి నేను తెలుసుకున్నాను. నాకంటే ఉత్తమ ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ అవుతారని నాకు ముందే తెలుసు. 1991 నుంచి 1996 మధ్య కాలంలో ఆయన ఆర్థిక మంత్రిగా ఎన్నో అనూహ్య విజయాలను సాధించారు. ఆయన అంతకుముందు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. చేపట్టిన ప్రతి పదవికి ఆయన గౌరవం తీసుకువచ్చారు. ఇదే కోవలో ఆయన దేశానికే గర్వకారణమయ్యారు. కోట్ల మంది దేశ ప్రజల జీవితాలను మార్చేసిన ఆయనను ప్రపంచ దేశాల రాజకీయ నాయకులు, పండితులు ఎంతో గౌరవభావంతో చూస్తారు.” అని సోనియా గాంధీ తన లేఖను పూర్తి చేశారు.