Snow : తెలుగు రాష్ట్రాల్లో చలి మొదలైపోయింది. సాయంత్రం 5 కాగానే చీకటి పడిపోతోంది. ఆ తర్వాత మెళ్లగా వణుకు. రాత్రి పెరుగుతున్న కొద్దీ.. చలి పెరిగిపోతోంది. తెల్లవారుజాము వేళలో వణుకు వణికించేస్తోంది. నగరాలు, గ్రామాల్లో ఉండే మనకే చలి తీవ్రత తెలుస్తుంటే.. ఇక మన్యం సంగతి చెప్పేదేముంది. లంబసింగి, చింతపల్లి మంచు దుప్పట్లో దూరిపోయాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలతో అక్కడ చలి చంపేస్తోంది. రోజు రోజుకీ టెంపరేచర్ బాగా పడిపోతోంది. ఇదే సరైన సమయం అంటూ పర్యాటకులు లంబసింగికి క్యూ కడుతున్నారు. చింతపల్లిలో సేద తీరుతున్నారు.
ప్రతీఏటా ఇంతే. అక్టోబర్ నుంచి జనవరి మధ్య మన్యంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయి. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 3వేల 600 అడుగుల ఎత్తులో ఉండటమే ఇందుకు కారణం. మొదట్లో సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో ఈ ప్రాంతం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ, ఓ దశాబ్ద కాలంగా మన్యం.. టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. ఊటీ, కొడైకెనాల్ లాంటి వాతావరణం మన తెలుగు రాష్ట్రంలోనే ఉండటంతో ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో లంబసింగి, చింతపల్లి, తాజంగి ప్రాంతాలకు వస్తున్నారు.
వీకెండ్, హాలిడేస్ లో రష్ బాగా ఉంటోంది. నైట్ అక్కడే స్టే చేసి.. ఉదయాన్నే కొండల అంచున మంచు అందాలను చూస్తూ పరవశించి పోతున్నారు. సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. వణికించే చలిలో.. నులువెచ్చని సూర్యకిరణాలతో.. చేతికి అందేంత ఎత్తులో మంచు తెరలతో.. మన మన్యం నిజంగా ప్రకృతి వరం.
పర్యాటకుల సంఖ్యకు తగ్గట్టుగా వసతులు మాత్రం లేవనే చెప్పాలి. స్థానికులే టూరిస్టులకు కావాల్సిన భోజన, వసతి ఏర్పాట్లు చేస్తూ ఉపాధి పెంచుకుంటున్నారు. గుడిసెలో చిన్నపాటి గదికే రూ.వెయ్యికి పైగా వసూలు చేస్తూ దండుకుంటున్నారనే విమర్శ ఉంది. సరైన ఆహారం లభించకపోవడం మరో మైనస్. అయితే, అక్కడి ప్రకృతి అందాలు, చలి గిలిగింతల ముందు ఇవేవీ ఇబ్బందులుగా అనిపించవు. ఒకసారి వెళ్లొస్తే.. మళ్లీ మళ్లీ వెళ్లాలని అనిపించే బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్…లంబసింగి, చింతపల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం.. చల్ చలోరే చల్.