BigTV English

Gaddar: చంద్రబాబు హయాంలో గద్దర్‌పై కాల్పులు.. మావోయిస్టుల లేఖలో సంచలన విషయాలు..

Gaddar: చంద్రబాబు హయాంలో గద్దర్‌పై కాల్పులు.. మావోయిస్టుల లేఖలో సంచలన విషయాలు..

Gaddar: విప్లవ వీరుడు, ప్రజల్లో చైతన్యం నింపేందుకు పాట పల్లకీ మోసిన ప్రజాగాయకుడి మరణంపై మావోయిస్టులు స్పందించారు. గద్దర్ కుటుంబానికి ప్రగాడ సంతాపాన్ని, సానుభూతిని తెలుపుతూ లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో ఈ లెటర్ రిలీజైంది.


అనేక పోరాటాల ప్రేరణతో.. తెలంగాణలో భూస్వామి వ్యతిరేక పోరాటలను తన పాటలతో ప్రజలకు తెలిపి వారిలో.. విప్లవ జ్వాలను రగిల్చిన జననాట్య మండలి ఏర్పాటులో.. గద్దర్ కృషి ఎంతో ఉందంటూ లేఖలో తెలిపారు మావోయిస్టులు. 1972లో మొదలైన గద్దర్‌ విప్లవ ప్రస్థానం 2012 వరకు కొనసాగిందన్నారు. 80వ దశకంలో నాలుగేళ్ల పాటు దళం జీవితం కొనసాగించారని చెప్పారు. గద్దర్‌ అవసరాన్ని గుర్తించి దళం నుంచి బయటకు పంపించామని.. 40 ఏళ్ల పాటు ప్రజల పక్షాన్నే ఆయన పోరాటం చేశారని.. మావోయిస్టు పార్టీ సభ్యుడిగా సాంస్కృతిక రంగంలో పనిచేస్తూ విప్లవోద్యమ నిర్మాణంలో విశేష కృషి చేశాడన్నారు మావోయిస్టులు.

చంద్రబాబు హయాంలో నల్లదండు ముఠా, పోలీసులు కలిసి గద్దర్‌పై కాల్పులు జరిపారని.. ఐదు బుల్లెట్లు దిగినా ఆయన ప్రాణాలతో బయటపడ్డారని లేఖలో ప్రస్తావించారు.


అయితే చివరి కాలంలో గద్దర్ పార్టీ నిబంధనావళికి విరుద్ధంగా పాలక పార్టీలతో కలపడంతో నోటీసులు ఇచ్చామని.. దీంతో 2012లో ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని మావోయిస్టులు లేఖలో తెలిపారు.

గద్దర్ మరణంపై మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో.. అప్పటి సీఎం చంద్రబాబుపై నేరుగా ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఆ రోజు అసలేం జరిగిందనే చర్చ మరోసారి మొదలైంది..

90ల్లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండేది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక.. వారి అణిచివేత ఎక్కువైంది. ఎన్‌కౌంటర్ల పేరుతో అనేక బూటకపు హత్యలు జరిగాయనే ఆరోపణ ఉంది. పోలీసులకు ఫుల్ పవర్స్ ఇవ్వడంతో ఖాకీలు రెచ్చిపోయారు. నక్సల్ నిర్మూలనకు స్పెషల్ టీమ్స్‌తో ఆపరేషన్స్ చేసేవారు. మఫ్టీ పోలీసులతో, మాజీ నక్సల్స్‌తో నల్లదండు ఏర్పాటు చేసి.. తమకు అడ్డుగా ఉన్న విప్లవకారులను ఏరివేసేవారనే విమర్శ ఉంది. అందులో భాగంగానే.. ప్రజా యుద్ధనౌక గద్దర్‌పైనా కాల్పులు జరిపించారని అంటారు.

1997, ఏప్రిల్ 6న గద్దర్ ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. గద్దర్ చనిపోయాడని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాల్పుల్లో గద్దర్‌కు ఆరు బుల్లెట్లు దిగాయి. వెంటనే హాస్పిటల్‌కు తరలించడంతో.. ప్రాణాపాయం తప్పింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి ఐదు బుల్లెట్లు తీసేశారు. నడుము భాగంలో ఒక్క బుల్లెట్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని అలానే ఉంచేశారు. మఫ్టీ పోలీసులే గద్దర్‌పై కాల్పులు జరిపారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ గద్దర్‌ను కాల్చిన దుండగులను గుర్తించకపోవడం.. ఆ కేసు కొలిక్కి రాకపోవడంతో ఆ ఆరోపణలు నిజమేనని అంటారు. కాల్పులు జరిగింది చంద్రబాబు హయాంలో కాబట్టి.. పరోక్షంగా ఆయనపైనా విమర్శలు వచ్చాయి.

తనపై జరిగిన హత్యా యత్నంపైనా పాట రాసి పాడారు గద్దరన్న. “ననుగన్న తల్లులారా.. తెలుగు తల్లి పల్లెలారా.. మీ పాటనై వస్తున్నానమ్మో.. మీ పాదాలకు వందనాలమ్మో.. ఎడమా చేతిన దిగిన తూట ఎత్తామంది ఎర్రా జెండా” అంటూ పాటతో విప్లవపథం కొనసాగించారు. తాజాగా, గద్దర్ మరణంపై మావోయిస్టులు రిలీజ్ చేసిన లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×