Fire Accident: హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా రెండు రోజుల వ్యవధిలోనే గ్రేటర్ లోని పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగి, వేల కోట్ల ఆస్థి బుగ్గిపాలైంది.
తాజాగా హైదరాబాద్ నిజాంపేటలో ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. టిఫిన్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న మూడు షాపులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
ఇదిలా ఉంటే.. గురువారం నాడు కొండాపూర్ మహీంద్రా షోరూమ్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. ఈ ప్రమాదంలో షోరూమ్‌లోని పలు కార్లు అగ్నికి ఆహుతైయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు.. మంటలు అదుపు చేశాయి. మంటలు పక్క షాపులు విస్తరించకుండా..ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పక్కనే ఉన్న సహర్ష్, ఉడిపి హోటల్ కు మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. మహీంద్రా షోరూమ్‌ను ఆనుకునే.. ఓయో రూంలలో ఉన్న వందమందిని బయటకు పంపించి వేశారు. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: మహేంద్ర షోరూంలో అగ్ని ప్రమాదం.. మంటలకు కారణం అదేనా?
ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా తెలుస్తోంది. ప్లాస్టిక్ సామాగ్రి , థర్మాకోల్ ఫ్యాబ్రిక్ వస్తువులు ఉండడంతో.. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ప్రమాద సమయంలో మహీంద్రా షోరూమ్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. షోరూం నలువైపులా ఉన్న షాపులు, హోటల్స్ వైపు మంటలు వ్యాప్తి చెందకుండా.. ఫైర్ సిబ్బంది కట్టడి చేయడంతో.. మంటలు అదుపులోకి వచ్చాయి.