Visakhapatnam- Durg Vande Bharat Express: సెమీ హైస్పీడ్ రైలుగా ఇండియన్ రైల్వేలోకి అడుగు పెట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ తక్కువ కాలంలోనే మంచి ఆదరణ దక్కించుకుంది. వేగవంతమైన ప్రయాణం, అత్యాధునిక సౌకర్యాలు ఉన్న నేపథ్యంలో ప్రయాణీకులు ఈ రైళ్లలో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు వందేభారత్ రైళ్లు సేవలను అందిస్తున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో కోచ్ ల సంఖ్య పెంచుతున్నారు రైల్వే అధికారులు. రీసెంట్ గా సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైళ్లకు సంబంధించి కోచ్ ల సంఖ్యను పెంచారు. వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అదనపు కోచ్ లను యాడ్ చేశారు.
విశాఖ-దుర్గ్ వందేభారత్ కోచ్ లు సగానికి తగ్గింపు
ఇక తాజాగా రైల్వే అధికారులు విశాఖపట్నం-దుర్గ్ మధ్య నడిచే వందేభారత్ రైలు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు కోచ్ లు సగానికి సగం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రూట్ లో పెద్దగా ప్రయాణీకుల నుంచి డిమాండ్ లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 16న విశాఖ-దుర్గ్((20829/20830) రైలును అధికారులు ప్రారంభించారు. 16 కోచ్ లతో ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ రూట్ లో అనుకున్న స్థాయిలో ప్రయాణీకుల నుంచి ఆదరణ లభించడం లేదు. కేవలం 40 నుంచి 45 శాతం ఆక్యుపెన్సీ ఉంటుంది. అటు దుర్గ్ నుంచి విశాఖ వచ్చే సమయంలో రాయగఢ వరకు 50 శాతం ఆక్యుపెన్సీ ఉంటుండగా, ఆ తర్వాత విశాఖ వరకు కేవలం 20 నుంచి 25 శాతం ఆక్యుపెన్సీ ఉంటున్నది. కోచ్ లన్నీ ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి.
ఎందుకు ఈ వందేభారత్ కు ఆదరణ లేదంటే?
విశాఖ-దుర్గ్ వందేభారత్ రైలుకు ఆదరణ అంతగా లేకపోవడానికి కారణం టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటమే అనే టాక్ వినిపిస్తున్నది. విశాఖపట్నం నుంచి పార్వతీపురానికి సాధారణ రైళ్లలో టికెట్ ధర రూ. 145. అదే వందేభారత్ రైళ్లలో రూ. 565గా ఉంది. ధర ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ రైలు ఎక్కడం లేదనే చర్చ నడుస్తున్నది. వాస్తవానికి ఈ రైలు క్యాన్సిల్ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, తొలుత కోచ్ ల సంఖ్య తగ్గించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఇవాళ్టి నుంచి 8 కోచ్ లతో ప్రయాణం
ఇక కోచ్ ల తగ్గింపు ఇవాళ్టి(జనవరి 24)నుంచి అమలు అవుతుందని అధికారులు తెలిపారు. 16 కోచ్ లు కాస్త ఇవాళ్టి నుంచి 8 కోచ్ లకు చేరుకోనుంది. వీటిలో ఏడు కోచ్‌లు చైర్ కార్ కోచ్ లు. ఒక్కో కోచ్ లో 70 సీట్లు ఉంటాయి. మరో కోచ్ ఎగ్జిక్యూటివ్ చైర్ ఉంటుంది. ఇందులో 40 సీట్లు ఉంటాయి. వాస్తవానికి వందేభారత్ రైళ్లు ఆయా రూట్లలో ప్రయాణీకుల ఆదరణను బట్టి 4, 8, 12, 16, 20, 24 కోచ్ తో నడుస్తున్నాయి.
Read Also: డబ్బులు లేకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఇండియన్ రైల్వే సూపర్ సర్వీస్ గురించి మీకు తెలుసా?