Hyderabad Metro – Betting Apps Ads : తెలంగాణలో యువతను తప్పుదారి పట్టిస్తున్న బెట్టింగ్ మాఫియాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో.. ఈ యాప్ లకు ప్రమోషన్ చేస్తున్న అనేక మంది ఇరకాటంలో పడ్డారు. ఆ జాబితాలో హైదరాబాద్ మెట్రో రైలు కూడా నిలవడం చర్చనీయాంశమైంది. ఎంతో మంది యువతను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెట్టింగ్ వేసేందుకు ప్రోత్సహిస్తూ.. వారి దగ్గర నుంచి వేలు, లక్షల వసూలు చేస్తూ.. అనేక మంది ప్రాణాలు తీసేశాయి ఈ బెట్టింగ్ యాప్ లు. వాస్తవానికి దేశంలో బెట్టింగ్ నిర్వహించడం చట్టవిరుద్ధం. అందుకే.. కోళ్ల పందాల దగ్గర నుంచి చీట్ల పేకాట వరకు ఎన్నో నిబంధనలు, నియంత్రణలు ఉన్నాయి. ప్రస్తుత సోషల్, టెక్నాలజీ యుగంలో ఈ బెట్టింగ్ ఆన్ లైన్ కు పాకగా..అక్కడా వేల మంది యువతరం జీవితాలు నాశనం అవుతున్నాయి. అలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రో సైతం పాత్ర వహించడంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
దిద్దుబాటు చర్యలు
హైదరాబాద్ మెట్రో రైల్వే సంస్థకు చెందిన అనేక చోట్ల బెట్టింగ్ అడ్వర్టైజ్ మెంట్ లపై మెట్రో ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం తన దృష్టికి వచ్చిందని తెలిపిన ఎన్వీఎస్ రెడ్డి.. తక్షణమే నష్టనివారణ చర్యలకు దిగుతున్నట్లు వెల్లడించారు. ప్రమాదకర బెట్టింగ్ లకు సంబంధించిన యాప్ లు, వాణిజ్య ప్రకటనల విషయం తనకు ఆలస్యంగా తెలిసిందన్న మెట్రో రైల్ ఎండీ..
ఆ ప్రకటనలను తక్షణమే తీసివేయాలని ఎల్‌అండ్‌టీ, సంబంధిత అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీలను ఆదేశించారు. ఎలాంటి ప్రకటనలను అయినా రాత్రి లోపు తీసేయాలని, రేపటి ఉదయానికి ఏ ఒక్క చోట బెట్టింగ్ ప్రమోషన్లు కనిపించేందుకు వీలు లేదంటూ తేల్చి చెప్పారు.
బిగ్ టీవీ ఎఫెక్ట్
హైదరాబాద్ మెట్లో రైళ్లు, రైల్వే స్టేషన్లల్లో అనేక చోట్ల బెట్టింగ్ యాప్ ల అడ్వర్టైజ్ మెంట్లు ఉన్న సంగతి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. ఇందులో తెలుగులోనే ప్రముఖ శాటిలైట్ న్యూస్ ఛానెల్ గా ఉన్న బిగ్ టీవీ క్రియాశీలకంగా వ్యవహరించింది. తన సాధనా సంపత్తిని వినియోగించి.. Say No to Betting apps అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. బిగ్ టీవీ యాజమాన్యంలోని సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ సైట్ ద్వారా విస్తృతంగా సమస్యను ప్రజలకు, ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లింది. బిగ్ టీవీ చేసిన ప్రయత్నాలకు తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది ప్రముఖులు చేస్తున్న ఈ బెట్టింగ్ ప్రమోషన్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారు చేస్తున్న చట్ట విరుద్ధమైన పనులపై పోలీసు శాఖ సీరియస్ అవ్వడం కేసులు బుక్ చేస్తుండడంతో.. అనేక మంది తమ తప్పును ఒప్పుకున్నారు. అదే తీరుగా… హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కూడా తన తప్పును దిద్దుకునేందుకు ముందుకు వచ్చింది.
Also Read : Betting Apps Case : 800 కేసులు.. 24 మందికి నోటీసులు.. కంప్లీట్ డీటైల్స్