Medak Tragedy: అసలే సమ్మర్ హాలిడేస్.. పిల్లలందరూ ఎంజాయ్ చేసే సమయం ఇది. కానీ ఆ పిల్లలు ఆటలాడుతూ ఉండగా, మృత్యువు పిడుగురూపంలో కబళించింది. ఆ కుటుంబానికి శోకం మిగుల్చింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అసలేం జరిగిందంటే..
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పడాలపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గ్రామానికి చెందిన బాలురు క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. జోరుగా హుషారుగా క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే మేఘం మెరిసింది.. వర్షం కురిసే సూచనలు ఎక్కువగా కనిపించాయి. ఇక అంతే క్షణాల్లో ఉరుములు, మెరుపులు మెదలయ్యాయి. దీనితో క్రికెట్ ఆడుతున్న నలుగురు బాలురు భయపడి, చెట్టు కిందకు పరుగెత్తారు. ఇక తాము సేఫ్ అని అనుకునే లోగానే, అకస్మాత్తుగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు ఈ విషయాన్ని గమనించి గాయపడ్డ బాలురులను వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే బాలుర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
పిడుగులు పడే సమయంలో జాగ్రత్తలు..
వర్షాకాలంలో పిడుగుల విరుచుకుపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో మనం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. పిడుగు పడే అవకాశం ఉన్నప్పుడు ఓపెన్ గ్రౌండ్, పొలాలు, చెట్ల కింద ఉండకూడదు. వెంటనే భద్రమైన ఇంట్లోకి వెళ్లాలి.
మొబైల్ ఫోన్లు, హెడ్ఫోన్లు ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు పక్కన పెట్టాలి.
ఎత్తైన నిర్మాణాల దగ్గర ఉండకూడదు. మినార్లు, టవర్లు, చెట్లు ప్రమాదకరమైనవి. నీటిలో ఉండకూడదు. పూల్స్, చెరువులు, కాలువలు వద్ద వర్షంలో ఉండడం అత్యంత ప్రమాదం. కార్, బస్సులలో ఉండటం శ్రేయస్కరం. వాహనాల్లో మెటల్ బాడీ పిడుగు శక్తిని భద్రంగా భూమికి చేరుస్తుంది. ఇంట్లో ఉంటే విద్యుత్ పరికరాలు, ప్లగ్ పాయింట్లు దూరంగా ఉండాలి.
Also Read: Bizarre Divorce Case: భార్య స్నానం చేయలేదని, విడాకులు కోరిన భర్త.. ట్విస్ట్ ఇచ్చిన లాయర్!
ఇలా కనిపెట్టండి..
నీలం రంగు మెరుపులు, ఉరుములు మొదలైతే.. ఇది పిడుగుపాటు హెచ్చరిక. వర్షం రాకముందే మెరుపులు కనిపిస్తే తక్షణమే భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ విషయాలను పిల్లలకు వివరించి, వారిని అప్రమత్తం చేయాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు.