Medaram Mini jatara 2025: ప్రపంచంలో అతి పెద్ద గిరిజన జాతరలో ఒకటి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. నేటి నుంచి (బుధవారం) మినీ జాతర ప్రారంభమైంది. జాతర నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ పేరిట ఫిబ్రవరి 12-15 వరకు మినీ జాతర జరగనుంది. నార్మల్ గా అయితే ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం జాతర జరగనుంది. మధ్యలో వచ్చేది మినీ జాతరగా నిర్వహిస్తారు.
మాఘ శుద్ధ పౌర్ణమి రోజు (నేటి) నుంచి నాలుగు రోజుల పాటు మండ మెలిగే పండుగగా వ్యవహరించారు పూజారులు. మేడారం గద్దెల చెంత కన్నెపల్లి ఆలయంలో శుద్ధి నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే మేడారం గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా మామిడాకులతో దిష్టి తోరణాలు కడతారు.
పున్నమి వెలుగుల్లో పూజారులు జాగారాలు చేయనున్నారు. పెద్ద జాతరకు రాని వాళ్లు తమ ముక్కులు ఇందులో చెల్లించుకుంటారు. జాతరకు ముందు నుంచే భక్తులు వేలాదిగా వచ్చి తల్లులను దర్శించుకుంటారు. బంగారం, పసుపు-కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జంపన్న వాగులో తొలుత స్నానమాచరిస్తారు. ఆ తర్వాత నేరుగా గద్దెల దగ్గరకు వచ్చి దర్శనాలు చేసుకుంటారు. పిల్లా పాపలతో చల్లగా చూడాలంటూ తల్లులను వేడుకుంటారు.
మండ మెలిగే పండుగతో మినీ జాతరను మొదలవుతుంది. గురువారం మండ మెలిగే పూజలు, శుక్రవారం భక్తుల మొక్కుల చెల్లించుకుంటారు. శనివారం చిన్నజాతర చేపడతారు నిర్వాహకులు. కష్టాలు తొలగిపోవాలంటూ బెల్లం కానుకగా సమర్పిస్తారు భక్తులు. మినీ జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేసింది.
ALSO READ: వేడెక్కిన స్థానిక సమరం.. దానిపై కారు-కమలం మల్లగుల్లాలు
ఇందుకోసం దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలు కేటాయించింది. నాలుగు రోజులు జరుగనున్న జాతరలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. పోలీసులతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది వెయ్యి మందికి పైగా విధుల్లో ఉంటారు.
మినీ జాతరకు కేవలం తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి రానున్నారు. ప్రస్తుతం జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నది అధికారుల అంచనా. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు నిలువెత్తు నిదర్శనం మేడారం మహా జాతర. ఆదివాసీ ఆచారాలతో నిర్వహించే ఈ పండుగ రెండేళ్లకోసారి అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహా జాతర జరిగిన మరుసటి ఏడాది చిన్న జాతర జరుగుతుంది.
జాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ దాదాపు 200 వరకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడుపుతోంది.భక్తుల రద్దీని బట్టి 24 గంటలు సైతం నడుపుతామని అంటున్నారు అధికారులు.గతంతో పోలిస్తే ప్రస్తుతం ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు చెబుతున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు మంత్రి సీతక్క.
భక్తుల కోసం పుణ్య స్నానాల కోసం షవర్లు, మహిళలు దస్తులు మార్చుకునేందుకు గదులు, సులభ్ కాంప్లెక్సులు, తాగునీటి ట్యాంకులు, అంబులెన్సులు, వైద్యకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక భక్తుల సేవలో వివిధ శాఖల అధికారులు ఉండనున్నారు. పోలీసులు, దేవాదాయశాఖ, జిల్లా పంచాయితీ, వైద్య, ఆరోగ్యం, నీటి పారుదలశాఖ, ఎన్పీడీసీఎల్, రెవిన్యూ, గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు ఉండనున్నారు.