Elon Musk Sam Altman Tweet War Over OpenAI| టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk), చాట్ జీపిటి రూపకర్త శామ్ ఆల్ట్ మెన్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఒకరు ట్వీట్ చేస్తే మరొకరు కౌంటర్ ట్వీట్ చేశారు. చివరి మస్క్ పరుషంగా సమాధాన మివ్వాల్సి వచ్చింది.
మస్క్ 2022లో ఎక్స్ (పూర్వం ట్విటర్) సంస్థను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దృష్టి చాట్ జీపిటి మాతృ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ఏఐ’ (OpenAI) మీద పడింది. ఈ కంపెనీని కొనుగోలు చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చారు.
2024లో రెండుసార్లు OpenAIపై దావా వేసిన మస్క్, ఇప్పుడు ఆ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. 97.4 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8.5 లక్షల కోట్లు) కొనుగోలు చేస్తామని మస్క్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందం ఆఫర్ ఇచ్చింది. కానీ ఈ ఆఫర్‌ని ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) తిరస్కరించారు. తిరస్కరించడమే కాదు ఎదురుగా ఆయన మరో ఆఫర్ ఇచ్చారు. ఈ కౌంటర్ ఆఫర్ తో మస్క్ మండిపోయారు.
“మీ ఆఫర్‌కు ధన్యవాదాలు, కావాలంటే మేమే మీ సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)ని 9.74 బిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో దాదాపు రూ. 85 వేల కోట్లు) కొనుగోలు చేస్తాము” అని ఆల్ట్‌మన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మస్క్ ఘాటుగా స్పందిస్తూ, “మోసగాడు” అని పరుషంగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: అమెరికా ప్రెసిడెంట్‌గా మస్క్.. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు ఆయన చేతుల్లోనే
ఓపెన్ఏఐలో మస్క్ పాత్ర
నవంబర్ 2022లో ఓపెన్ఏఐ ద్వారా ప్రారంభించబడిన చాట్‌జీపీటీ (ChatGPT) కేవలం ఆరు నెలల్లోనే అధిక ప్రజాదరణ పొందింది. శామ్ ఆల్ట్‌మన్ 2015లో ఓపెన్ఏఐని ప్రారంభించినప్పుడు, మస్క్ కూడా దానిలో పెట్టుబడులు పెట్టారు. అయితే, 2018లో మస్క్ ఆ సంస్థ నుంచి బయటకు వచ్చారు. మస్క్ వెళ్లిన తర్వాత, 2019లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఓపెన్ఏఐలో పెట్టింది.
2024లో మస్క్ ఓపెన్ఏఐ కంపెనీపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ ప్రారంభించినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఈ దావాపై తీర్పు ఇంకా వెలువడలేదు. ఇంతలోనే మస్క్ ఓపెన్ఏఐని కొనుగోలు చేయాలనుకుంటున్న విషయం బహిరంగమైంది.
టిక్‌టాక్ కొనుగోలుపై మస్క్
మరోవైపు, ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok)పై అమెరికాలో నిషేధం ముప్పు పొంచి ఉంది. ఈ నిషేధం నుంచి తప్పించుకోవడానికి, అమెరికాలోని టిక్‌టాక్ కార్యకలాపాలను ఎలోన్ మస్క్‌కు విక్రయించాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, మస్క్ ఈ విషయంపై స్పష్టంగా తన స్పందనను తెలిపారు.
“నేను టిక్‌టాక్ కోసం బిడ్డింగ్ వేయలేదు. దాన్ని కొనుగోలు చేయాలనే ఆసక్తి లేదు. ఒకవేళ కొన్నా, ఏం చేయాలనేదానిపై ఎలాంటి ప్రణాళికలు లేవు. నాకు కంపెనీలు కొనడం కంటే, వాటిని స్థాపించడం అంటేనే ఇష్టం” అని మస్క్ పేర్కొన్నారు.
టిక్‌టాక్ నిషేధం
2017లో ప్రారంభమైన టిక్‌టాక్‌ను భారత్ సహా అనేక దేశాలు నిషేధించాయి. అమెరికాలో కూడా కొన్ని రాష్ట్రాలు టిక్ టాక్ వినియోగంపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో, ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఒక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం, టిక్‌టాక్ యాజమాన్యం చైనా నుంచి వైదొలగకపోతే, దానిపై నిషేధం విధించబడుతుంది.
అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు డెడ్‌లైన్ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, 75 రోజుల్లోగా టిక్‌టాక్‌ను అమ్మేయాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. టిక్‌టాక్ జాయింట్ వెంచర్‌లో అమెరికాకు 50 శాతం వాటా ఇస్తే, దానికి ప్రయోజనం చేకూరేలా చూస్తానని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే, టిక్‌టాక్ యాజమాన్యం మస్క్‌కు దీన్ని విక్రయించాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.