Slab Collapsed: మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని.. అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్మాణం కొనసాగుతున్న.. ఒక భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని అత్యవసర చికిత్స కోసం సమీప హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు బయటకు వచ్చేలోపే యూనివర్సిటీ యాజమాన్యం, హాస్పిటల్ సిబ్బంది మీడియాను నిలువరించేందుకు ప్రయత్నించారు. మీడియా ప్రతినిధులను యూనివర్సిటీ క్యాంపస్‌కి లోపలికి అనుమతించలేదు. ప్రమాదంపై స్పష్టత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలకు ఇది మరింత అనుమానాలకు తావిస్తోంది.
ఈ యూనివర్సిటీ జనగాం ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డికి చెందినదిగా గుర్తించడంతో.. రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఈ యూనివర్సిటీ అధికారులు ఫుల్‌టాంక్ లెవెల్ (FTL) ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని.. స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో.. ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటువంటి ఘటనలు విద్యార్థుల భవిష్యత్తు మీద మాత్రమే కాదు, వారి ప్రాణాల మీద కూడా ప్రమాదాన్ని తేవడమే.. నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే.. ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: మురికి కాలువలో వినూత పీఏ మృతదేహం.. చంపింది ఎవరు ?
ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యంపై.. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్.. బాధిత కుటుంబాల నుంచే కాకుండా, విద్యార్థుల సంఘాల నుంచి కూడా వెలువడుతోంది.