Hyderabad Metro Man : హైదరాబాద్ మెట్రో రైల్. ఇదో వండర్. పీపీపీ మోడల్‌లో చేపట్టిన అతిపెద్ద వెంచర్. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ప్రాజెక్ట్. నిత్యం లక్షలాది మందిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తోంది. మంచి లాభాలతో నడుస్తోంది. హైదరాబాద్‌కు సరికొత్త బ్రాండ్ క్రియేట్ చేసింది. అలాంటి హైదరాబాద్ మెట్రో రైల్ క్రెడిట్‌లో సింహభాగం ఆ సంస్థ ఎండీ NVS రెడ్డికే దక్కుతుంది. సర్వం తానై పని చేశారు. విజయవంతంగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, రన్ చేశారు. ఆ క్రమంలో ఏకంగా 370 కోర్టు కేసులను ఫేస్ చేశారాయన. అందుకే NVS రెడ్డిని మెట్రో మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ అంటున్నారు అంతా. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి.. బిగ్ టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. తన ప్రస్థానంలో ఎదురైన సవాళ్లు, హేళనలు, సంతోషాలు, ప్రశంసలను ప్రత్యేకంగా వివరించారు.
పిచ్చోడన్నారు..
మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రతిపాదన వచ్చిన కొత్తల్లో అనేక ఛాలెంజెస్ ఫేస్ చేశారాయన. రోడ్డు మీద రైల్ అంటున్నాడు.. ఆయనేమైనా పిచ్చోడా అంటూ కామెంట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనిది PPP మోడల్‌లో మెట్రో రైల్ నిర్మాణం ఏంటని ప్రశ్నించారు. అలాంటి ఎన్నో సవాళ్ల మధ్య పని చేశారు ఎన్‌వీఎస్ రెడ్డి. ఏకంగా ఆరుగురు సీఎంలతో కలిసి వర్క్ చేయడమంటే మాటలా? ఆ క్రెడిట్ ఆయనకే దక్కింది. అందరు ముఖ్యమంత్రులు ఆయన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. అందరితో శెభాష్ అనిపించుకున్నారు.
చంద్రబాబు, వైఎస్సార్‌ల కాంబినేషన్ రేవంత్
ఐఆర్ఎస్‌లో 20 ఏళ్లు పని చేశాక డిప్యూటేషన్ మీద స్టేట్ కేడర్‌కు వచ్చారు NVS రెడ్డి. చంద్రబాబు ప్రోత్సాహంతో MMTS ప్రాజెక్టును సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ ప్రభుత్వంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ బాధ్యత ఆయన చేతుల్లోకి వచ్చింది. మొత్తంగా ఆరుగురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. మెట్రో రెండో దశలో భాగంగా పాతబస్తీలో మెట్రో రైల్ పూర్తి చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు, వైఎస్సార్‌ల కాంబినేషనే రేవంత్‌రెడ్డి.. అని అన్నారు ఎన్వీఎస్ రెడ్డి.
ఇంజినీరింగ్ ఇన్నోవేషన్..
MMTS తో హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారని చెప్పారు. అప్పట్లో దానిని వేస్ట్ ప్రాజెక్ట్ అని కొందరు అన్నారని.. ఇప్పటికీ MMTS లో లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ హయాంలో ఏడాదిపాటు అధ్యయనం చేశాకే.. మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు ఆనాటి సర్కార్ ఓకే చేసిందని గుర్తు చేశారు. ఇంజినీరింగ్ ఇన్నోవేషన్‌తో మెట్రో మోడల్ డిజైన్ చేశామన్నారు. టికెట్ రేట్స్, ప్రాపర్టీ డెవలప్‌మెంట్, ప్రకటనలతో ఆదాయం సమకూరుతోందని చెప్పారు. అయితే, మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే ఆపరేషనల్ కాస్ట్ దాటేసిందని.. కాకపోతే ఆర్థికంగా ఇంకా లాభాల్లోకి రాలేదని తెలిపారు.
డ్రైవర్ లెస్ రైల్స్
హైదరాబాద్ మెట్రోలో అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నామని చెప్పారు ఎండీ. ఇక్కడ దగ్గర నడుస్తున్నవి ఇంటెలిజెంట్ ట్రైన్స్ అని.. అవి తమ ప్రయాణంలో పరస్పరం ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయని చెప్పారు. ఆటోమెటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉందన్నారు. అందుకే ప్రమాదాలు జీరో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 57 ట్రైన్స్‌తో రోజుకు 1100 ట్రిప్స్ నడిపిస్తున్నామని.. భవిష్యత్తులో డ్రైవర్ లెస్ రైల్‌ను నడిపిస్తామని ధీమాగా చెప్పారు NVS రెడ్డి.
రెండ దశ ఎప్పుడు పూర్తి అవుతుందంటే..
2017లో హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రారంభం కాగా.. ప్రస్తుతం రెండవ దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 116 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట.. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్.. మియాపూర్ నుంచి పటాన్‌చెరు.. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్.. ఇలా రెండో దశలో 5 కొత్త కారిడార్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అప్పుడు హైదరాబాద్ మెట్రో విస్తీర్ణం 185 కి.మీలకు పెరుగుతుంది. రెండవ దశ కూడా PPP మోడల్‌లోనే నిర్మించనున్నారు. ఇప్పటికే DPRలు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ.24,269 కోట్లు అని చెప్పారు NVS రెడ్డి.
పూర్తి వివరాలు బిగ్ టీవీ ఇంటర్యూలో చూడొచ్చు…