Mimicry Artist: తెలుగు నాట తన గళంతో నవ్వులు పంచిన ప్రముఖ మిమిక్రీ, మ్యాజిక్, వెంట్రిలాక్విజం కళాకారుడు సత్యనారాయణ (40) రోడ్డు ప్రమాలంలో ప్రాణాలు కోల్పోయారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై జరిగిన ఈ ఘోర ప్రమాదం కళాలోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బతుకమ్మ వేడుకలను ముగించుకుని రాత్రి సమయంలో కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం ఎలా జరిగిందంటే?
సత్యనారాయణ ప్రయాణిస్తున్న కారును ఓ గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఊహించని పరిణామానికి కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమవగా.. సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు దశాబ్దాల కళా ప్రస్థానం
సుమారు 15 ఏళ్లకు పైగా కళా రంగానే తన సర్వస్వంగా భావించిన సత్యనారాయణ.. తెలుగు రాష్ట్రాల్లో రెండు వేలకు పైగా వేదికలపై అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. కేవలం మిమిక్రీ మాత్రమే కాకుండా మ్యాజిక్, వెంట్రిలాక్విజం వంటి విభిన్న కళలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఎప్పుడూ నవ్విస్తూ, నవ్విస్తూ ఉండే ఆయన అర్ధాంతంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు, తోటి కళాకారులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Also Read: హైదరాబాద్‌లో విషాదం.. 30వ అంతస్తు నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి