Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టారు. సోమవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారని పేర్కొంటూ ఆమె కంటతడి పెట్టారు.
‘బీఆర్ఎస్ సోషల్ మీడియాలో నాపై అసహ్యంగా పోస్టులు పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్టు?. అధికారం పోయిందని.. బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు. మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టులను చూసి తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నాను. పూలదండ వేస్తే ఇష్టంవచ్చినట్టు ట్రోలింగ్ చేస్తారా? అటవీ జాతి ప్రవర్తన ఇది.. సిగ్గు, లజ్జ ఉంటే బజారులో తిరుగు. నీ ఇంట్లో చెల్లిని ఇలాగే చేస్తే ఊరుకుంటారా?. కేటీఆర్… మీ చెల్లికి, మీ తల్లికి చూపించు.. కరెక్టే అంటే చెప్పు. కేసీఆర్, కేటీఆర్ ఖబర్దార్.. మీరు వెంటనే దీనిపై స్పందించి క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని బట్టలిప్పించి ఉరికిస్తాం’ అంటూ ఆమె సీరియస్ అయ్యారు.
Also Read: సిద్ధిపేట జిల్లాలో టెన్షన్..టెన్షన్… గ్రామస్తుల ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేకపోయిన పోలీసులు.. చివరకు..
‘మంత్రిగా ఉన్న నాపైనే సోషల్ మీడియాలో ఈ విధంగా అసభ్యంగా పోస్టులు పెట్టారు. దీంతో నేను మానసిక వేదనలో ఉన్నాను. ఇక మిగతవాళ్ల పరిస్థితి ఏమిటి చెప్పండి. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ నేతలకు కూడా వారివారి ఇంట్లో మహిళలు ఉన్నారు. వారిపై ఈ విధంగా ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో బీఆర్ఎస్ నేతలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు.. మంత్రులుగా పనిచేశారు. అటువంటి మీరే ఈ విధంగా ప్రవర్తిస్తే ఎంత వరకు కరెక్టు? మహిళలను గౌరవించాల్సింది పోయి అగౌరపరుస్తారా?
గతంలో కూడా మహిళలకు ఫ్రీ బస్సు పథకం విషయంలో కేటీఆర్ ఇదే విధంగా మహిళలను అవమానపరుస్తూ మాట్లాడారు. ఇదా మీరు నేర్చుకున్నది? రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత డబ్బులే ధ్యేయంగా ముందుకెళ్లింది. అహంకారంగా వ్యవహరించింది. ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా దోచుకున్నారు. దీంతో వారు ఎన్నికల్లో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అధికారం కోల్పోయి పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారు. పశువులకైనా నీతి నిజాయితీ ఉంటుంది. కానీ, బీఆర్ఎస్ వాళ్లకు లేదు. మాపై దారుణంగా అవమానకర పోస్టులు పెడుతున్నారు.
ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తగిన మూల్యం తప్పక చెల్లించుకోవాల్సి ఉంటుంది. మా కార్యకర్తలను కూడా కొట్టారు. ఈ విషయంలో కూడా వారికి ఎప్పటికైనా తగిన మూల్యం తప్పదు. నాలాంటి ఆడబిడ్డ శాపం తగులుతుంది. నేను రాజకీయంలో ఉండి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు నాపై ఎటువంటి అవినీతి మరక లేదు. పార్టీలకు అతీతంగా అందరూ అక్కా అని పిలుస్తారు. ఎంతో గౌరవంగా నన్ను చూస్తారు. ఇలా ప్రజలతో ప్రేమగా మెదిలే నాపై ఇటువంటి అవమానకార పోస్టులు పెట్టడం సరికాదు.
ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే వాటిపై విమర్శలు చేయండి కానీ, ఈ విధంగా మానసికంగా ఇబ్బందులు పెట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు. సమాజంలో మీకు తగిన బుద్ధి తప్పదు. దీనిపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశాం’ అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.