Warangal Politics: ఉమ్మడి వరంగల్ జిల్లా లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ మిగతా ఎమ్మెల్యేలు అన్నట్లు వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. అంతా కలిసి కట్టుగా పనిచేయాలని సీఎం, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి చెప్పినప్పటికీ ఫలితం కనిపించటం లేదు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ టీమ్ లో జిల్లా మంత్రి కొండా సురేఖ లేకపోవటం.. వరంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సీనియర్ నేత ఎమ్మెల్యే కడియం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, మామిడాల యశ్విసిని రెడ్డి, కేఆర్ నాగరాజు లు సీఎంను ప్రత్యేకంగా కలిశారు. జిల్లా ఎమ్మెల్యేలు సీఎం ను కలిస్తే తప్పకుండా ఆ జిల్లా మంత్రి ఉంటారు. కానీ ఎందుకు ఈ టీమ్ తో కొండా లేరన్నది బిగ్ డిస్కషన్ గా మారింది. ఎమ్మెల్యేలు ఆమెకు సమచారం ఇచ్చినప్పటికీ రాలేరా? లేదంటే ఆమెకు సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యేలంతా సీఎంను కలిశారా? తెలియాల్సి ఉంది.
కేవలం జిల్లా అభివృద్ధికి సంబంధించి సీఎం ను కలిశామంటూ కడియం తో వెళ్లిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ వరంగల్ రాజకీయం కొన్నాళ్లుగా రసవత్తరంగా సాగుతోంది. కొండా ఫ్యామిలీ ఒక వైపు మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మరొక వైపు చీలిపోయారు. ఇన్నాళ్లు కొండా సురేఖతో సన్నిహితంగా కనిపించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని కూడా కడియం టీమ్ లో కనిపించటంతో అసలు ఏం జరుగుతోందన్న చర్చ సాగుతోంది. మొత్తానికి కొండా ఫ్యామిలీ తీరుతో వాళ్లను మిగతా ఎమ్మెల్యేలు పక్కన పెడుతున్నారంటూ వరంగల్ లో చర్చ సాగుతోంది.
అటు ఎమ్మెల్యేల బృందానికి కడియం నాయకత్వం వహించటంపై కొండా వర్గీయులు గుర్రుగా ఉన్నారు. కావాలనే ఆయన రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఐతే కడియం వర్గీయులు మాత్రం ఆయనకు అలాంటి రాజకీయాలు అవసరం లేదంటున్నారు. మొత్తానికి మంత్రి లేకుండానే సీఎంను జిల్లా ఎమ్మెల్యేలు కలవటం వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరును బయటపెట్టింది.
Also Read: రాత్రి వేళ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నం, ఎవరి పని?
ఈ కయ్యానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ స్వయంగా చెప్పినప్పటికీ ఎవరూ తగ్గటం లేదు. దీంతో జిల్లాలో పార్టీకి ఇది మంచిది కాదని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే అంతా కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరముందని చెబుతున్నాయి.