Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో చెరువుల నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోని అన్ని చెరువులూ నిండు కుండల్లా మారిపోయాయి. పలు చోట్ల వర్ష సంబంద ఘటనల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అధికార యంత్రాంగ అప్రమత్తంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు.
పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో యాకూబ్ అనే ఇటుకలు తయారు చేసే కూలీ కుటుంబం వరదలో కొట్టుకుపోయిందని వివరించారు. ఈ ఘటన వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. రెస్క్యూ టీం ఎంతో శ్రమకోర్చి వారిని కాపాడే ప్రయత్నాలు చేసిందని వివరించారు. యాకూబ్ కొడుకును మాత్రమే టీం కాపాడగలిగిందని తెలిపారు. మిగిలిన సభ్యులు కూడా రెస్క్యూ టీంకు దొరకాలని భగవంతుడిని ప్రార్థించారు. వారిని కాపాడటానికి తాను హెలికాప్టర్ కోసం కూడా ప్రయత్నించానని, కానీ, వాతావరణం సహకరించని కారణంగా ఆ ప్రయత్నం సఫలం కాలేదని తెలిపారు. ఈ వివరాలు చెబుతూ మంత్రి పొంగులేటి భావోద్వేగానికి గురయ్యారు. మీడియా సమావేశంలోనే కంటతడి పెట్టుకున్నారు. వారికి లైఫ్ జాకెట్స్ ఉన్నాయని, కాబట్టి, వారు దొరికే అవకాశాలు ఉన్నాయని, దొరకాలనే తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. వారితో మాట్లాడినప్పుడు ఆ తల్లి రోధించిందని చెప్పారు. తాము మరికాసేపట్లో చావబోతున్నామనే బాధ వారి గొంతులో వినిపించిందని, ఆ బాధ వర్ణనాతీతమని కంటతడి పెట్టుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భీకర వర్షం పడుతున్నది. మరో రెండు రోజులు కుండపోత వర్షం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇది వరకే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. సీఎస్, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీ రాజ్, హైడ్రా, నీటి పారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. 24 గంటలు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సెలవులు పెట్టొద్దని సూచించారు.
Also Read: Heavy Rain: కోదాడలో బీభత్సం సృష్టిస్తున్న వర్షం .. వరదలో కొట్టుకొచ్చిన 2 మృతదేహాలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం చాలా అలర్ట్‌గా ఉందని తెలిపారు. అన్ని జిల్లాలతో తాను మాట్లాడినట్టు వివరించారు. రెస్క్యూ టీంలు ఏర్పాటు చేసుకోవాలని హైడ్రాను ఆదేశించినట్టు చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లను ఆదేశించినట్టు వివరించారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న రోడ్లపైకి వాహనాలను అనుమతించరాదని తెలిపారు. అత్యవసరమైతే తప్పా.. ప్రజలు బయటకు రావొద్దని సూచనలు చేశారు.
రేపు విద్యా సంస్థలకు సెలవు
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రేపు (సెప్టెంబర్ 2) రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.