Ponnam Prabhakar: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది అయిన సందర్భంగా ఓ వైపు ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో పాలకపక్షం వైఫల్యాలపై బీజేపీ సరూర్ నగర్‌లో బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో బీజేపీపై రుసరుసలాడారు మంత్రి పొన్నం ప్రభాకర్.
చారిత్రాత్మక ప్రాంతం చార్మినార్ నుంచి బీజేపీపై పలు ప్రశ్నలు సంధించారు మంత్రి పొన్నం. గడిచిన 11 ఏళ్లలో తెలంగాణకు మోదీ సర్కార్, ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకి ఏమి ఇవ్వక పోగా, గత ప్రభుత్వం అడగలేదనే నెపంతో దాట వేసే ధోరణిని తప్పుబట్టారు.
బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మొన్న వరదలు వచ్చినప్పుడు నష్ట పరిహారం ఇవ్వకుండా తెలంగాణపై వివక్ష చూపలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. గతంలో ఆర్కియాలజీ- టూరిజం మంత్రిగావున్న కిషన్‌రెడ్డి మీ ముద్ర ఏది? హైదరాబాద్ నగరానికి ఏం చేశారనేది సరూర్ నగర్ సభలో చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ అంటే చెరువులకు కేరాఫ్ అని, దాన్ని బాగు చేసుకోవడం తమ బాధ్యతగా చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం కేంద్రాన్ని అన్నిరకాలుగా తెలంగాణకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కానీ ఎలాంటి చలనం లేదన్నారు. ముమ్మాటికీ తెలంగాణ ప్రయోజనాలకు నెరవేరుస్తున్నామని చెప్పుకొచ్చారు.
ALSO READ: సీఎం రేవంత్ మనసులోని మాట.. తెలంగాణలో ప్రభుత్వానికి ఏడాది
శనివారం సాయంత్రం సరూర్ నగర్‌లో బీజేపీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. దీనికి ముఖ్య అతిధిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సభలో తెలంగాణకు ఏమైనా ఇస్తామని నడ్డా ప్రకటన చేస్తారా లేదో చూడాలి. ఐఐఎం కావాలని తెలంగాణ నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దానిపై ఆయన నోరు విప్పుతారా లేదా అనేది చూడాలి.