ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకోవాలి
⦿ వసతులు, భోజనం విషయంలో అలసత్వం వద్దు
⦿ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించం
⦿ గురుకుల పాఠశాలల హాస్టల్లు తనిఖీలు చేయాలి
⦿ కొత్త మెనూ ప్రకారమే భోజనం
⦿ విశ్వకర్మ పథకం లబ్ధిదారులను గుర్తించాలి
⦿ బీసీ సంక్షేమ శాఖ రివ్యూ జూమ్ మీటింగ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, స్వేచ్ఛ: Ponnam Prabhakar: ప్రతి విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యార్థులకు మౌలిక వసతుల్లో, భోజనం విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ, కమిషనర్, ఎంజేపీ గురుకుల సొసైటీ కార్యదర్శి, ఆర్ సీఓ, ప్రిన్సిపల్స్, జిల్లా అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు చేశారు. విద్యార్థులు గురుకులంలో చేరే నాటికే వారికి ఇవ్వాల్సిన యూనిఫామ్, ట్రంక్ పెట్టే, బెడ్డింగ్ మెటీరియల్ అన్నీసిద్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు.
ప్రతి విద్యార్థి పై శ్రద్ధ తీసుకోవాలని, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైన బీసీ సంక్షేమ శాఖను ఏడాది కాలంగా చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్నకార్యక్రమాలకు సహకారం అందిస్తున్న అధికారులను ఆయన ఈ సందర్శంగా అభినందించారు. తమకు కేటాయించిన పని విషయంలో అలసత్వం వహిస్తే మాత్రం సహించబోనని ఆయన హెచ్చరించారు.
బాధ్యతగా పని చేయాలి
విద్యార్థుల భవిత బాగుండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని, ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాకొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగడం మనసును కలచివేస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల మౌలిక భోజన సదుపాయాల కల్పనలో రాజీ పడవద్దని, మార్చిన మెనూ ప్రకారం భోజనం తప్పనిసరిగా అందించాలని, ఆర్ సీఓలు, జిల్లా అధికారులు తరచుగా తనీఖీలు చేయాలని ఆయన సూచించారు. గురుకుల, హాస్టల్ విద్యార్థులకు పరీక్ష సమయంలో ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలని, మెరుగైన ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయడంతో పాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
సమస్యలు ఉన్న భవనాలను ఖాళీ చేయాలి
జాతీయ రోడ్డు భద్రత మాసంలో భాగంగా అన్నిగురుకులాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. కామన్ డైట్‌లో భాగంగా మార్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని, అందుకు కావల్సిన వంట సామాను, ఆహార పదార్ధాలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, తరచుగా తనీఖీలు చేయాలని ఆయన సూచించారు. సంక్రాంతి పండుగలోగా సమస్యలు ఉన్న భవనాలను ఖాళీ చేసి కొత్త భవనంలోకి మార్చాలని ఆయన సూచించారు. అద్దె భవనాల నుంచి సొంత భవనాలు కల్పించడానికి వీలుగా ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలన్నారు. ఆహార పదార్థాల కొనుగోలు, నిల్వ, నాణ్యత, విద్యార్థుల ఆరోగ్యం, చదువు తదితర అంశాలపై ప్రతినెలా నివేదిక ఇవ్వాలన్నారు.
బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు జరిగిందన్నారు. బీసీలను ఆర్థికంగా బలోపేతం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, ఫెడరేషన్స్ ఆధ్వర్యంలో బీసీ వర్గాల అభ్యున్నతికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. టాడీ టాపర్స్ కోసం రూపొందించిన కాటమయ్య కిట్ ఇప్పటివరకు పదివేల మందికి అందించామని, మరో పదివేల మందికి అందించడానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. నాయీ బ్రాహ్మణ, రజక ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత కరెంటు పథకం యథావిధిగా కొనసాగుతుందన్నారు.
Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
విశ్వకర్మ పథకంపై అవగాహన కల్పించాలి
కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ద్వారా కులవృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించే విశ్వకర్మ పథకం గురించి అందరికీ అవగాహన కల్పించాలని, ప్రతి జిల్లా నుంచి 35వేల మంది లబ్ధిదారులను గుర్తించాలని మంత్రి సూచించారు. ఇప్పటి వరకు 33వేల దరఖాస్తులు చేయించిన నల్లగొండ జిల్లా అధికారిని అభినందించారు. ఈ పథకంపై అవగాహన కల్పించడంలో వెనుకబడిన వారికి ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, కమిషనర్ బాల మాయాదేవి, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి బడుగు సైదులు, సంయుక్త కార్యదర్శి తిరుపతి, మద్దిలేటీ, ఇతర ఉన్నతాధికారులు, ఆర్ సీఓలు, ప్రిన్సిపాల్స్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.