Ponnam Prabhakar: తెలంగాణ వ్యాప్తంగా కుల గణన నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కులగణన సర్వేకు సంబంధించిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కులగణన విజయవంతం కావడంతో.. అన్ని రాష్ట్రాలు సర్వే నిర్వహణపై దృష్టి సారించాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ కులగణన సర్వేపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన సర్వేను పకడ్బందీగా నిర్వహించడం జరిగిందన్నారు. కుల గణన నివేదికను ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి అందించడం జరిగిందన, పలు అంశాలు చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాము ఎన్నికల ముందు చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే పూర్తి చేసిందని, ఇప్పటికీ వివరాలు ఇవ్వనివారు ఎవరైనా ఉంటే వివరాలు అందించవచ్చని మంత్రి పొన్నం సూచించారు.
ప్రధాన రాజకీయ పార్టీల పెద్ద నేతలు కూడా సర్వేకు వివరాలు ఇవ్వలేదని, కవిత ఒక్కరే సర్వే బృందానికి వివరాలన్నీ అందించారన్నారు. బీసీలకు న్యాయం జరిగే సమయం వచ్చిందని, దానిని ఎవరు అడ్డుకోవాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమానికి అడ్డుపడే శక్తులు ఉంటే వారిని అడ్డుకొని ముందుకు పోవాలని కోరుతున్నట్లు మంత్రి పొన్నం సూచించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు, బీసీ సంఘాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ అభినందిస్తూ సంబరాలు చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. నాడు ప్రభుత్వ ఉద్యోగులు సర్వేల కోసం వస్తే దాడులు చేసి అవమానించారన్నారు. నేడు అదే సర్వే విజయవంతం కావడంతో సైలెంట్ అయ్యారన్నారు.
గతంలో మాదిరిగా సర్వేకు సంబంధించిన అన్ని వివరాలను ఫ్రిజ్ లో పెట్టే రకం తాము కాదని, తప్పనిసరిగా అన్ని వివరాలను సమాజం ముందు ఉంచుతామన్నారు. ఇంకా సర్వేపై ఎవరికైనా అనుమానాలు ఉంటే తక్షణం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వివరాలు ఇవ్వనివారు ఎందుకు ఇవ్వలేదో కవిత ప్రశ్నించాలని మంత్రి అన్నారు.
రేపటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలని, తాను కోరుకుంటున్నట్లు, అందుకు ప్రత్యేక ఆహ్వానం ఏమి కానీ అందజేయమని మంత్రి అన్నారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ రేపు సభకు హాజరవుతారని.. లేకుంటే వేరేలా ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. సర్వే గురించి సర్వేకు సహకరించని వారు కూడా మాట్లాడడం అర్ధరహితంగా ఉందని, రాష్ట్రంలో 96.9% సర్వే పూర్తిగా జరిగిందన్నారు.
Also Read: Netanyahyu Gaza War Again : గాజా యుద్ధం మళ్లీ మొదలు?.. నెతన్యాహుపై రాజకీయ ఒత్తిడి
మంత్రి పొన్నం కామెంట్స్ ను బట్టి ఇప్పుడు బడా లీడర్స్ చాలా వరకు తమ వివరాలు ఇవ్వలేదని చెప్పవచ్చు. అసలు సామాన్య ప్రజానీకం అందించిన వివరాలను బడా నేతలు అందించక పోవడం వెనుక పెద్ద మతలబు ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం సామాన్యులకేనా, ఇప్పటికైనా మారండి.. సర్వే కు మీ వివరాలు అన్నీ ఇవ్వండి అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఇప్పటికీ సర్వే వివరాలు చెప్పని ఆ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.