Netanyahyu Gaza War Again | ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మళ్లీ గాజా యుద్ధం ప్రారంభించబోతున్నారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. మార్చి లేదా ఏప్రిల్ 2025 తిరిగి హమాస్ పై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనికి ప్రధాన కారణం.. ఇజ్రాయెల్ రాజకీయాలే. ప్రధాని నెతన్యాహుపై ఇజ్రాయెల్ రాజకీయ పార్టీలు, నాయకులందరూ యుద్దం ప్రారంభించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. చేయకపోతే ఆయన ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదముందని తెలుస్తోంది.
ప్రస్తుతం గాజా యుద్ధంలో అమెరికా, అరబ్బు దేశాలు మధ్యవర్తిత్వం చేయడంతో కాల్పుల విరమణకు హమాస్, ఇజ్రాయెల్ ప్రభుత్వం అంగీకరించాయి. అందులో భాగంగా కాల్పుల విరమణ తొలిదశ ముగిసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ వద్ద బందీలుగా ఉన్న పాలస్తీనా వాసులు, హమాస్ సభ్యులను విడుదల చేసేందుకు నెతన్యాహు ప్రభుత్వం అంగీకరించగా.. హమాస్ కూడా ఇందుకు బదులుగా తన వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను దశల వారీగా విడుదల చేస్తోంది.
అయితే ఇలా గాజాలో యుద్ధం ఆగిపోవడం ఇజ్రాయెల్ మంత్రులు, యూదుమత అతివాద రాజకీయ పార్టీలకు మింగుడు పడడం లేదు. అందుకే ఆ పార్టీల మద్దతుతో ప్రభుత్వం నడుపుతున్న నెతన్యాహుకు హెచ్చరికలు జారీ అయ్యాయి. వెంటనే యుద్ధం తిరిగి ప్రారంభించకపోతే ఇజ్రాయెల్ లో రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదాలు ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి.
Also Read: ప్రపంచంపై ట్రంప్ వాణిజ్య యుద్ధ ప్రభావం.. సుంకాలతో ధరల మోత
ఇజ్రాయెల్ మంత్రులు, కీలక నాయకుల రాజీనామాతో నెతన్యాహుపై ఒత్తిడి
గాజా యుద్ధంతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినందుకు నెతన్యాహు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఇతమర్ బెన్ గ్విర్ తన పదవికి రాజీనామా చేశారు. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన తొలిరోజే ఆయన రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో అతివాద పార్టీకి చెందిన నాయకుడు, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోత్రిచ్ కూడా నెతన్యాహుకు అల్టిమేటం జారీ చేశారు. కాల్పల విరమణ తొలి దశ ముగియగానే తిరిగి యుద్ధం ప్రారంభించాలని లేకపోతే తాను కూడా రాజీనామా చేస్తానని.. ఆ తరువాత ప్రభుత్వం కూలిపోతే నెతన్యాహునే బాధ్యత వహిలచాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి నెతన్యాహు పార్టీకి ఇజ్రాయెల్ పార్లామెంటులో మెజారిటీ ఉంది. కానీ పరిస్థితులు ఏ నిమిషంలోనైనా మారిపోయే అవకాశం కూడా లేకపోలేదు.
మరోవైపు గాజా కాల్పులవిరమణ ప్రకటించ వెంటనే ఇజ్రాయెల్ సైన్యంలో టాప్ ఇజ్రాయెలీ జెనెరల్ హెర్జీ హలేవీ రాజీనామా చేశారు. హలేవీ రాజీనామా చేసిన తరువాతి రోజే గాజాలో సైనిక ఆపరేషన్లను నిర్వర్తించే దక్షిణ ఇజ్రాయెల్ సైనిక మేజర్ జెనెరల్ యారోన్ ఫింకెల్‌మ్యాన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.
రాజీనామాలతో నెతన్యాహుకు ప్రమాదం
నెతన్యాహు ప్రధాన పదవికి అక్టోబర్ 2023 నుంచే గండం ఉంది. అక్టోబర్ 7 2023న హమాస్ పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పై దాడుల చేసి వేయికి పైగా ఇజ్రాయెల్ పౌరులను చంపింది. వందల సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. అయితే ప్రపంచంలోనే అత్యంత భారీ సెక్యూరిటీ కలిగిన ఇజ్రాయెల్ లో హమాస్ ఇదంతా ఎలా చేయగలిగిందనే ప్రశ్నకు సమాధానం ఇంతవరకు లభించలేదు. దీంతో ఈ ఘటనపై విచారణ జరగాల్సి ఉండగా.. ప్రధాని నెతన్యాహు ఈ విచారణకు యుద్ధం ముగిశాక చేయాలని ఆదేశించారు.
ఈ విచారణ మొదలైతే ప్రధాన మంత్రి నెతన్యాహు ప్రభుత్వం బాధ్యతారాహిత్యమా? లేక ఏదైనా కుట్ర ఉందా? అనే విషయాలు బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి. ఈ భయాలే ఇప్పుడు నెతన్యాహుకు వెంటాడుతున్నాయి. అయితే నెతన్యాహు త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ట్రంప్‌తో యుద్ధం ప్రారంభించే విషయంపై చర్చించే అవకాశాలున్నాయి. ఎందుకంటే గాజాలో కాల్పుల విరమణ తరువాత హమాస్ మిలిటెంట్లు మళ్లీ పట్టు సాధించారు. దీంతో మర్చి లేదా ఏప్రిల్ లో యద్ధం మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.